సమ్మె గురించి కేసీఆర్‌తో మాట్లాడుతా: పవన్‌ కల్యాణ్‌

October 31, 2019


img

ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వథామరెడ్డి, ఇతర నేతలు గురువారం హైదరాబాద్‌లో జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ను కలిసి తమ సమ్మెకు మద్దతు కోరగా ఆయన సానుకూలంగా స్పందించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ, “ఆర్టీసీ కార్మికుల డిమాండ్లపై కూర్చొని చర్చిస్తే తప్పకుండా సమస్య పరిష్కారం అవుతుందని నేను భావిస్తున్నాను. కానీ ఆర్టీసీ కార్మికులు 27 రోజులుగా సమ్మె చేస్తున్నప్పటికీ కార్మికులతో చర్చించి సమస్యను పరిష్కరించుకొనే ప్రయత్నం చేసినట్లు నాకు అనిపించలేదు. ప్రభుత్వం ఇంత మొండిపట్టు పట్టడం సరికాదని నా అభిప్రాయం. సిఎం కేసీఆర్‌ అంటే నాకు అపారమైన గౌరవం ఉంది. ఒకటి రెండు రోజులలోనే నేను సిఎం కేసీఆర్‌ను కలిసి ఆర్టీసీ సమ్మె గురించి మాట్లాడుతాను. ఒకవేళ ఆయన సానుకూలంగా స్పందిస్తే మంచిదే లేకుంటే ఆర్టీసీ సమ్మెకు జనసేన మద్దతు ఇస్తుంది,” అని చెప్పారు.

పవన్‌ కల్యాణ్‌ సానుకూలంగా స్పందించడం హర్షణీయమే కానీ హైకోర్టుతో సహా కాంగ్రెస్‌, బిజెపి, వామపక్షాలు, టిడిపి వంటి పెద్ద పార్టీల సూచనలనే పట్టించుకోని సిఎం కేసీఆర్‌, తెలంగాణలో ఉనికే లేని జనసేన మాట వింటారనుకోలేము. అయితే తెలంగాణ రాష్ట్రంలో కూడా పవన్‌ కల్యాణ్‌కు చాలా మంది అభిమానులు ఉన్నందున, ఆయన పిలుపు మేరకు వారు కూడా ఆర్టీసీ సమ్మెలో చేరితే సమ్మె మరింత ఉదృతమయ్యే అవకాశం ఉంటుంది.


Related Post