నవంబర్ 2న తెలంగాణ మంత్రివర్గ సమావేశం

October 31, 2019


img

నవంబర్ 2న ప్రగతి భవన్‌లో మంత్రివర్గ సమావేశం జరుగనున్నట్లు తాజా సమాచారం. ఆర్టీసీ సమ్మె నానాటికీ ఉదృతమవుతున్నందున సమావేశంలో దానిపై మంత్రులతో చర్చించి సముచిత నిర్ణయం తీసుకోవాలని సిఎం కేసీఆర్‌ భావిస్తున్నందున ఈ అత్యవసర మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం. 

ఆర్టీసీ సమ్మె విషయంలో సిఎం కేసీఆర్‌ ఇప్పటివరకు రవాణామంత్రి పువ్వాడ అజయ్ కుమార్‌, రవాణాశాఖ, ఆర్టీసీ అధికారులతో మాత్రమే చర్చించి ప్రభుత్వం తరపున ఏకపక్షంగానే నిర్ణయాలు తీసుకొంటున్నారు కానీ అవి ఆశించిన  ఫలితాలు ఇవ్వకపోగా బెడిసికొడుతున్నాయి. ఒకపక్క హైకోర్టులో ప్రభుత్వానికి మొట్టికాయలు పడుతున్నాయి. మరోపక్క ఆర్టీసీ కార్మికులకు సెప్టెంబర్ జీతాలు చెల్లించకపోయినప్పటికీ, ఉద్యోగాలలో నుంచి తొలగిస్తామని హెచ్చరించినప్పటికీ, ఆర్టీసీలో భారీగా అద్దె, ప్రైవేట్ బస్సులను ప్రవేశపెట్టడానికి సన్నాహాలు చేస్తున్నప్పటికీ  ఏమాత్రం భయపడకుండా 27 రోజులుగా సమ్మె చేస్తూనే ఉన్నారు. వారి సమ్మె నానాటికీ ఉదృతమవుతోందే తప్ప ఏమాత్రం తగ్గడం లేదు. సుదీర్గంగా కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మె వలన బస్సులు లేక రాష్ట్ర ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుండటంతో తీవ్ర అసంతృప్తి, అసహనం వ్యక్తం చేస్తున్నారు. 

ఆర్టీసీ సమ్మె, సెప్టెంబర్ నెల జీతాలు, ఆర్టీసీ బకాయిల చెల్లింపు తదితర అంశాలపై నవంబర్ 1న మళ్ళీ హైకోర్టులో విచారణ జరుగబోతోంది. ఇప్పటికే ప్రభుత్వ వైఖరి పట్ల హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తోంది కనుక నవంబర్ 1న జరుగబోయే విచారణ ఏవిధంగా ముగుస్తుందో ఊహించుకోవచ్చు. ఈసారి హైకోర్టు స్వయంగా ఆర్టీసీ సమ్మె ముగింపుకు ప్రభుత్వానికి ఆదేశాలు, మార్గదర్శకాలు జారీ చేసినా ఆశ్చర్యం లేదు.  

ఆర్టీసీ సమ్మె విషయంలో సిఎం కేసీఆర్‌ ప్రగతి భవన్‌లో కూర్చొని ఏకపక్ష నిర్ణయాలు తీసుకొంటున్నారని, ఆయన వెంట మంత్రులు, ఎమ్మెల్యేలు ఎవరూ లేరని ఆర్టీసీ జేఏసీ నేతలు, ప్రతిపక్షనేతలు వాదిస్తున్నారు. కనుక తన నిర్ణయాలకు మంత్రివర్గం చేత ఆమోదముద్ర వేయించుకొనేందుకే ఈ సమావేశం ఏర్పాటు చేసి ఉండవచ్చు లేదా సమ్మెపై తుది నిర్ణయం తీసుకోవడం అనివార్యంగా మారింది కనుక మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేసి ఉండవచ్చు. ఆర్టీసీ కార్మిక సంఘాలతో ప్రభుత్వం రాజీపడి సమ్మెకు ముగింపు పలుకుతుందా లేక ఆర్టీసీలో అద్దె, ప్రైవేట్ బస్సులను ప్రవేశపెట్టి ముందుకు సాగుతుందా? అనేది మంత్రివర్గ సమావేశం తరువాత తెలుస్తుంది.


Related Post