తెలంగాణలో శానిటేషన్ హబ్‌ ఏర్పాటు

October 31, 2019


img

దేశంలో చాలా రాష్ట్రాలు పారిశుధ్య రంగాన్ని పెద్దగా పట్టించుకోవు. అది మున్సిపాలిటీల విధులలో ఒక భాగం మాత్రమేనని భావిస్తుంటాయి. నగరాలు, పట్టణాలు, గ్రామాలలో రోజూ రోడ్లు, కాలువలు క్లీన్ చేయించడం, చెత్తను తీసుకువెళ్లి ఊరవతల పారబోయడం, వరదలు, వానలు వచ్చినప్పుడు డ్రైనేజీలు పొంగిపొర్లుతుంటే వాటిని సరిచేసి ప్రజలకు ఇబ్బంది లేకుండా చేయడంతోనే సరిపెడుతుంటాయి. అంతకు మించి ఎక్కువ ఆలోచించవు. 

కానీ ప్రతీ అంశంపై లోతుగా...విన్నూత్నంగా ఆలోచనలు చేసి వాటి కోసం నూతన విధానాలు, ప్రణాళికలు రూపొందించుకొనే తెలంగాణ ప్రభుత్వం మాత్రం పారిశుధ్య రంగాన్ని కూడా ప్రత్యేక దృష్టితోనే చూసి, ప్రయోగాత్మకంగా హైదరాబాద్‌లో సాలిడ్ వేస్ట్ రీ ప్రాసెసింగ్ పరిశ్రమను ఏడాదిన్నర క్రితమే ప్రారంభించింది. దానితో సత్ఫలితాలు వస్తుండటంతో రాష్ట్రంలో శానిటేషన్-హబ్‌ ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు ప్రారంభించింది. 

ఘన, ద్రవ వ్యర్ధాలను రీసైక్లింగ్ చేసే పరిశ్రమలు, వాటికి సంబందించి యంత్ర పరికరాలను తయారుచేసే పరిశ్రమలను దానిలో ఏర్పాటు చేయాలని భావిస్తోంది. ఇటువంటి ప్రయత్నం జరగడం దేశంలోనే తొలిసారి అని చెప్పవచ్చు. దీని కోసం అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా అవసరమైన సాంకేతిక సహాయం అందజేస్తోంది. హైదరాబాద్‌లో నెలకొల్పబోతున్న ‘అర్బన్ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్’ లో ఇది భాగంగా ఉంటుంది. ఈ శానిటేషన్ హబ్‌కు తెలంగాణ ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించబోతోంది. దీనిని ప్రైవేట్ లేదా కేంద్రప్రభుత్వం భాగస్వామ్యంలో నెలకొల్పాలని ఆలోచిస్తోంది. దీని కోసం రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్‌ డిల్లీలో కేంద్ర గృహ నిర్మాణం, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి హర్దీప్‌ సింగ్‌ పురిని కలిసి ఈ ప్రాజెక్టు గురించి వివరించారు. 

ఈ ప్రాజెక్టు ప్రారంభమైతే తెలంగాణతో సహా దేశంలో అన్ని రాష్ట్రాలకు పారిశుధ్య రంగానికి సబందించిన ఆధునిక యంత్రపరికరాలు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వస్తాయని కేటీఆర్‌ తెలిపారు. దీనివలన రాష్ట్రంలో పారిశుద్య వ్యవస్థలో పెనుమార్పులు వస్తాయని చెప్పారు. అంతేకాక ఈ శానిటేషన్ హబ్‌ వలన సుమారు 20,000 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు, పరోక్షంగా అనేకమందికి ఉపాది అవకాశాలు లభిస్తాయని తెలిపారు. దీని నుంచి పన్నుల రూపేణా ప్రభుత్వానికి భారీగా ఆదాయం కూడా లభిస్తుందని కేటీఆర్‌ వివరించారు. దీనికోసం రూ.1,000 కోట్లు మూలధనంగా నిధులు కేటాయించాలని మంత్రి కేటీఆర్‌ కేంద్రమంత్రి హర్దీప్‌ సింగ్‌ పురిని కోరారు.


Related Post