హుజూర్‌నగర్ ఉపఎన్నికల ఓట్ల కౌంటింగులో తెరాస అభ్యర్ధి సైదిరెడ్డి గెలుపు దాదాపు ఖాయం అయిపోయింది. గత ఏడాది జరిగిన ముందస్తు అసెంబ్లీ ఎన్నికలలో కూడా ఆయన హుజూర్‌నగర్ నుంచి పోటీ చేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి చేతిలో స్వల్ప తేడాతో ఓడిపోయారు. సిఎం కేసీఆర్ మళ్ళీ ఆయనకే టికెట్ కేటాయించడంతో ఈసారి భారీ మెజార్టీతో గెలుస్తున్నారు.
కాంగ్రెస్ పార్టీకి ముఖ్యంగా...ఉత్తమ్ కుమార్ రెడ్డి కుటుంబానికి కంచుకోటగా చెప్పుకోబడుతున్న హుజూర్‌నగర్ నియోజకవర్గం తెరాస చేతిలోకి వెళ్లిపోవడానికి కారణం ఆయన తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి నల్గొండ నుంచి లోక్‌సభకు పోటీ చేయడమేనని చెప్పవచ్చు. 11 మంది కాంగ్రెస్ ఎమ్మేల్యేలు తెరాసలోకి ఫిరాయిస్తే, ఉత్తమ్ కుమార్ రెడ్డి స్వయంగా మరోసీటును తెరాసకు అప్పగించినట్లయింది. అంతేకాదు..కంచుకోట వంటి తన అసెంబ్లీ నియోజకవర్గాన్ని చేజేతులా తెరాసకు అప్పగించినట్లయింది.
నిజానికి గత ఏడాది జరిగిన ముందస్తు ఎన్నికలలోనే స్వల్ప మెజార్టీతో గట్టెక్కినపుడే తెరాసకు మరో అవకాశం కల్పిస్తే ప్రమాదం అని ఉత్తమ్ కుమార్ రెడ్డి గ్రహించి ఉండాలి. కానీ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి నానాటికీ అగమ్యగోచరంగా మారుతుండటం, కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే జాతీయ రాజకీయాలలోకి వెళ్లిపోవాలనే ఆశతో లోక్‌సభ ఎన్నికలలో పోటీ చేసి గెలిచారు. ఆ ఎన్నికలలో ఆయన గెలవగలిగారు కానీ కాంగ్రెస్ చేతిలో ఉన్న హుజూర్‌నగర్ నియోజకవర్గాన్ని ఇప్పుడు చేజార్చుకొన్నారు. దాని వలన వ్యక్తిగతంగా ఆయన నష్టపోకపోవచ్చు కానీ కాంగ్రెస్ పార్టీ నష్టపోయింది.
ఉత్తమ్ కుమార్ రెడ్డి దంపతులకు కంచుకోటగా చెప్పబడుతున్న కోదాడ, హుజూర్‌నగర్ రెండు నియోజకవర్గాలు తెరాస చేతిలోకి వెళ్లిపోయాయి మిగిలిన ఈ నాలుగున్నరేళ్ళలో తెరాస అక్కడ పూర్తి పట్టు సాధించడం ఖాయం. కనుక ఇక ఆ రెండు నియోజకవర్గాలను కాంగ్రెస్ పార్టీ మరిచిపోవలసిందే. దీనికంతటికి కారణం ఉత్తమ్ కుమార్ రెడ్డి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి లోక్‌సభకు పోటీ చేయడమేనని చెప్పక తప్పదు.