ఆర్టీసీ కధ మళ్ళీ మొదటికొచ్చిందా?

October 23, 2019


img

టిఎస్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే ప్రధాన డిమాండ్‌తో సమ్మె మొదలైన సంగతి అందరికీ తెలిసిందే. ఆ తరువాత హైకోర్టు విచారణలో ఆర్టీసీ కార్మిక సంఘాల తరపున వాదించిన న్యాయవాది ‘విలీనం కోసం పట్టుపట్టబోమని’ కోర్టుకు తెలిపారు. కనుక ఆర్టీసీ జేఏసీతో చర్చలు ప్రారంభించాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. విలీనంపై ఆర్టీసీ సంఘాలు వెనక్కు తగ్గినందున వారి మిగిలిన డిమాండ్లపై అధ్యయనం చేసి సిఫార్సు, నివేదిక ఇచ్చేందుకు ప్రభుత్వం ఆరుగురు సభ్యులతో కమిటీ వేసింది. వారు ఒకటి రెండు రోజులలో నివేదిక సమర్పించనున్నారు. కనుక త్వరలోనే మళ్ళీ చర్చలు ప్రారంభం అవుతాయని అందరూ ఎదురుచూస్తున్నారు. 

కానీ ఆర్టీసీ ఐకాస కన్వీనర్ అశ్వథామరెడ్డి బుదవారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ, “ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే డిమాండ్‌తో సహా ఏ ఒక్క డిమాండును మేము వదులుకోలేదు. వదులుకోబోము కూడా. మా డిమాండ్లన్నీ పరిష్కారం అయ్యేవరకు మా పోరాటం కొనసాగుతుంది. ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులలో గందరగోళం సృష్టించి సమ్మెను విచ్చిన్నం చేయాలని ప్రయత్నిస్తోంది. కనుక ఆర్టీసీ కార్మికులెవరూ ప్రభుత్వం ఉచ్చులో చిక్కుకోవద్దని మనవి చేస్తున్నాను. మా డిమాండ్లపై ప్రభుత్వం ప్రజాభిప్రాయసేకరణ చేయించాలి. ఒకవేళ ప్రజలు మా పోరాటాన్ని తప్పుగా భావిస్తే తక్షణం సమ్మె విరమించి విధులలో చేరడానికి సిద్దంగా ఉన్నాము. ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వోద్యోగులతో సమానంగా గుర్తింపు కల్పిస్తామని ఆనాడు సిఎం కేసీఆర్‌ చెప్పారు. కానీ ఇప్పుడు సాధ్యం కాదంటున్నారు. ఎందుకు కాదో ఆయన చెప్పాలి,” అని అన్నారు. 

ఆర్టీసీ కార్మిక సంఘాలు విలీనంపై వెనక్కు తగ్గాయని భావించే ప్రభుత్వం వారి మిగిలిన డిమాండ్లపై ఆలోచించడం మొదలుపెట్టింది కానీ అశ్వధామరెడ్డి ‘విలీనం కూడా తప్పనిసరి’ అని నేడు తేల్చి చెప్పడంతో ఇక ప్రభుత్వానికి-ఆర్టీసీ జేఏసీకి మద్య రాజీ కుదిరే అవకాశం లేకుండా పోయింది. కనుక ఆర్టీసీ సమ్మె మళ్ళీ మొదటికొచ్చినట్లయింది. కనుక ఈ వ్యవహారం ఇప్పుడు హైకోర్టులోనే తేల్చుకోక తప్పదేమో?


Related Post