కేంద్రం చెప్పిందే చేస్తున్నాం: సిఎం కేసీఆర్‌

October 23, 2019


img

ఆర్టీసీ సమ్మెపై మంగళవారం ప్రగతి భవన్‌లో జరిగిన సమీక్షా సమావేశంలో పాల్గొన్న ఉన్నతాధికారులను ఉద్దేశ్యించి సిఎం కేసీఆర్‌ మాట్లాడుతూ, “1950 నాటి మోటారువాహన చట్టంలో 3వ సెక్షన్‌కు 2019 బడ్జెట్‌ సమావేశాలలో నరేంద్రమోడీ ప్రభుత్వం సవరణలు చేసింది. దాని ద్వారా రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థల పనితీరును మెరుగుపరిచేందుకు ప్రైవేట్ భాగస్వామ్యం కల్పించేందుకు అవకాశం కల్పించింది. కనుక ఆ చట్టం ప్రకారమే మన ప్రభుత్వం ఆర్టీసీలో ప్రైవేట్ సర్వీసులను ప్రవేశపెట్టాలని నిర్ణయించుకొంది. కానీ నరేంద్రమోడీ రూపొందించిన చట్టాన్ని రాష్ట్ర బిజెపి నేతలు వ్యతిరేకిస్తున్నారు. సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులకు మద్దతు ఇస్తూ ప్రభుత్వానికి ఇబ్బందికర పరిస్థితులను సృష్టిస్తున్నారు. టెలికాం, విమానయాన సర్వీసులలో ప్రైవేట్ రంగాన్ని అనుమతించడం వలననే సామాన్య ప్రజలకు తక్కువ ధరలలో మెరుగైన సేవలు లభిస్తున్నాయి. అదేవిధంగా నష్టాలలో కూరుకుపోతున్న ఆర్టీసీని గాడిన పెట్టేందుకు దానిలో కొంతమేర ప్రైవేట్ భాగస్వామ్యాన్ని ఆహ్వానించాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే రాష్ట్ర బిజెపి నేతలు ఆర్టీసీ కార్మికులతో కలిసి ఆందోళనలు చేస్తున్నారు. వారిపై కేంద్రప్రభుత్వానికి ఫిర్యాదు చేద్దాం,” అని అన్నారు. 

ఆర్టీసీ సమ్మెకు కాంగ్రెస్‌ పార్టీ కూడా మద్దతు పలకడాన్ని సిఎం కేసీఆర్‌ తీవ్రంగా తప్పు పట్టారు. “మధ్యప్రదేశ్ రాష్ట్రంలో దిగ్విజయ్ సింగ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే అక్కడి ఆర్టీసీని మూసివేసింది. కాంగ్రెస్‌, బిజెపి పాలిత రాష్ట్రాలలో అమలుచేయలేని వాటిని తెలంగాణ రాష్ట్రంలో అమలుచేయాలని పట్టుపడుతున్నారు. ఇది వారి ద్వందవైఖరికి అద్దం పడుతోంది,” అని సిఎం కేసీఆర్‌ అన్నారు. 



Related Post