ఆర్టీసీ సమ్మెను గవర్నర్‌ పరిష్కరించగలరా?

October 22, 2019


img

ఆర్టీసీ సమ్మెపై ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఆర్టీసీ కార్మికులు 18రోజులుగా సమ్మె చేస్తున్నారు. ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరిపి సమ్మె ముగింపజేయాలని హైకోర్టు సూచించినప్పటికీ ప్రభుత్వం స్పందించలేదు. అలాగే నిధులు కొరత సాకు చూపుతూ సెప్టెంబర్ నెల జీతాలు కూడా చెల్లించలేదు. ఆర్టీసీ జేఏసీ నేతలు సోమవారం రాజ్‌భవన్‌కు వెళ్ళి గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ను కలిసి ఈ సమస్యలను పరిష్కరించవలసిందిగా ఆమెను కోరారు. ఆమె కూడా సానుకూలంగా స్పందించినట్లు ఆర్టీసీ జేఏసీ నేతలు చెప్పారు.

ఆర్టీసీ విషయంలో సిఎం కేసీఆర్‌ మొదటి నుంచి కటినంగానే వ్యవహరిస్తున్నారు. ఈసారి ఇంకా కటినంగా వ్యవహరిస్తున్నారు. హైకోర్టులో కూడా తన ప్రభుత్వ వైకఃరిని బలంగా సమర్ధించుకొంటున్నారే తప్ప ఏమాత్రం వెనకడుగు వేయడంలేదు. 

ఒకవేళ నేడు నరసింహన్ తెలంగాణ గవర్నర్‌గా కనుక ఉండి ఉంటే ఆయన పట్ల సిఎం కేసీఆర్‌కు అపారమైన గౌరవం, అభిమానం ఉన్నాయి కనుక ఆయన సిఎం కేసీఆర్‌ను తప్పక ఒప్పించి ఈ సమస్యను పరిష్కరించి ఉండేవారేమో? కానీ కొత్తగా వచ్చిన తమిళిసై సౌందరరాజన్‌ను ఇప్పటివరకు సిఎం కేసీఆర్‌ ఒకే ఒకసారి కలిశారు. ఆర్టీసీ సమ్మె విషయంలో హైకోర్టుకే తన ప్రభుత్వ వైఖరిని పదేపదే స్పష్టంగా చెపుతున్న సిఎం కేసీఆర్‌, కొత్తగా వచ్చిన గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ సలహాలను పట్టించుకొంటారనుకోలేము. బహుశః ఆమెకు కూడా ఇది తెలుసు కనుక చొరవ తీసుకొని భంగపడటం కంటే దీనిపై హైకోర్టు ఎలాగూ విచారణ జరిపి త్వరలో తీర్పు చెప్పబోతోంది కనుక అంతవరకు మౌనం వహించడం మేలని భావించవచ్చు.

కానీ ఒకవేళ ఆర్టీసీ సమ్మె విషయంలో కేంద్రం జోక్యం చేసుకోవాలని ఆలోచిస్తున్నట్లయితే మాత్రం ఆమె తప్పకుండా సలహాల పేరిట కేసీఆర్‌ సర్కారుకు నిర్ధిష్టమైన ఆదేశాలు జారీ చేయవచ్చు. కనుక ఆర్టీసీ సమ్మె విషయంలో ఆమె వైఖరిని బట్టి కేంద్రం వైఖరిని కూడా తెలుసుకోవచ్చు. కానీ ఆమె దీనిపై స్పందిస్తారో లేదో?


Related Post