పాపం ఆర్టీసీ కార్మికులు...దీపావళికి డబ్బులేవు

October 21, 2019


img

ఇవాళ్ళ టిఎస్ ఆర్టీసీ యాజమాన్యం సెప్టెంబర్ నెల జీతాలు చెల్లిస్తుందని ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న ఆర్టీసీ కార్మికులు తీవ్రనిరాశ చెందారు. ఈ కేసుపై నేడు హైకోర్టులో విచారణ జరిగింది.  ఆర్టీసీ యాజమాన్యం తరపున వాదించిన అడ్వకేట్ జనరల్, కార్మికుల జీతాలు చెల్లించడానికి యాజమాన్యం వద్ద తగినంత డబ్బు లేదని చెప్పారు. ఆర్టీసీ కార్మికులకు జీతాలు చెల్లించాలంటే రూ.239 కోట్లు అవసరమని కానీ ఆర్టీసీ యాజమాన్యం వద్ద రూ.7.49 కోట్లు మాత్రమే ఉందని కనుక ప్రస్తుత పరిస్థితులలో ఆర్టీసీ కార్మికులకు జీతాలు చెల్లించలేమని తేల్చి చెప్పారు. ఇరుపక్షాల వాదనలు విన్న తరువాత ఈ కేసును ఈనెల 29కి వాయిదా వేస్తున్నట్లు హైకోర్టు ప్రకటించింది. ఆర్టీసీ సమ్మె, జీతాల చెల్లింపు రెండు కేసులను కలిపి అదే రోజున మళ్ళీ విచారణ చేపడతామని చెప్పింది. 

ఆర్టీసీ కార్మికులు అక్టోబర్ 5వ తేదీ నుంచి సమ్మె మొదలుపెడితే, సెప్టెంబర్ నెలలో పనిచేసిన రోజులకు జీతాలు చెల్లించడానికి తమ వద్ద డబ్బు లేదంటూ ఆర్టీసీ యాజమాన్యం వితండవాదన చేస్తోంది. ఒకవేళ ఆర్టీసీ కార్మికులు సమ్మె చేయకపోయుంటే సెప్టెంబర్ నెలాఖరున లేదా అక్టోబర్ 1వ తేదీన జీతాలు చెల్లించి ఉండేదే కదా?అప్పుడు ఇవ్వగలిగినప్పుడు ఇప్పుడు ఎందుకు ఇవ్వడం లేదంటే ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వాన్ని ఎదిరించి సమ్మె చేస్తున్నారనే కక్షతోనే అని భావించాల్సి ఉంటుంది. అయితే కార్మిక చట్టాల ప్రకారం పనిచేసిన రోజులకు తప్పనిసరిగా జీతాలు చెల్లించవలసిందే లేకుంటే హైకోర్టు చేత మొట్టికాయలు వేయించుకొని జీతాలు చెల్లించవలసి వస్తుంది. 

సంస్థ నష్టాలలో ఉంది కనుక జీతాలు చెల్లించలేమనేది కూడా వితండవాదనే. ఎందుకంటే, ఆర్టీసీ సంస్థ దివాళా తీసి మూతపడిపోలేదు. అక్టోబర్ 4 అర్ధరాత్రి సమ్మె మొదలైనప్పటి నుంచి నేటి వరకు ఆర్టీసీ బస్సులు తిరుగుతూనే ఉన్నాయి. అంటే సంస్థ యధాప్రకారం పనిచేస్తూనే ఉందని స్పష్టం అవుతోంది. సంస్థ పనిచేస్తున్నప్పుడు ఆర్టీసీ కార్మికులకు చెల్లించవలసిన జీతాల బకాయిలు చెల్లించలేమని ఆర్టీసీ యాజమాన్యం చెపితే హైకోర్టు చేత మొట్టికాయలు వేయించుకోవలసి వస్తుంది. 

ఈ పరిణామాలపై ప్రజలలో, తెరాసలో భిన్నాభిప్రాయాలు ఉంటే ఉండవచ్చు కానీ 48,900 మంది ఆర్టీసీ కార్మికుల వెనుక వారి కుటుంబాలు కూడా ఉన్నాయని, వారందరూ రోడ్డునపడి ఆక్రోశిస్తుంటే ఆర్టీసీ యాజమాన్యానికి, తెరాస సర్కార్‌కు కూడా మంచిది కాదు. గౌరవం కాదు. 

దసరా పండుగకు చేతిలో డబ్బు లేక విలవిలలాడిన ఆర్టీసీ కార్మికులు, ఈ కేసును హైకోర్టు 29కి వాయిదా వేయడం వలన దీపావళి పండుగను కూడా జరుపుకోలేని దుస్థితి ఏర్పడుతుంది. కనుక సమ్మె పట్ల ఆర్టీసీ యాజమాన్యానికి, ప్రభుత్వానికి ఎటువంటి అభిప్రాయాలూ, ఆలోచనలు ఉన్నప్పటికీ ఆర్టీసీ కార్మికులకు వారు పనిచేసిన రోజులకు జీతాలు చెల్లించడం మంచిది. అదే ధర్మం.


Related Post