మళ్ళీ సైదిరెడ్డికే హుజూర్‌నగర్‌ టికెట్

September 21, 2019


img

పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఖాళీ చేసిన హుజూర్‌నగర్‌ శాసనసభ స్థానానికి పార్టీ తరపున అభ్యర్ధిగా ఎవరిని నిలబెట్టాలనే విషయంపై ఆ పార్టీ నేతలు కీచులాడుకొంటుండగా, తెరాస అభ్యర్ధిగా మళ్ళీ సైదిరెడ్డినే నిలబెట్టాలని సిఎం కేసీఆర్‌ నిర్ణయించారు. ఆయన 2018 ముందస్తు ఎన్నికలలో ఉత్తమ్ కుమార్ రెడ్డి చేతిలో స్వల్ప తేడాతో ఓడిపోయారు. కానీ ఈసారి ఆయన తప్పకుండా విజయం సాధిస్తారని కేసీఆర్‌ భావించడంతో మళ్ళీ ఆయనకే టికెట్ కేటాయించారు. 

కాంగ్రెస్ అభ్యర్ధిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్య పద్మావతీ రెడ్డి పోటీ చేసే అవకాశం ఉంది. కానీ చామల కిరణ్ రెడ్డికి టికెట్ ఇవ్వాలని రేవంత్‌ రెడ్డి పట్టుబడుతున్నారు. ప్రజా సమస్యలను పరిష్కరించలేని స్థితిలో ఉన్న కాంగ్రెస్ కాంగ్రెస్ నేతలు హుజూర్‌నగర్‌ టికెట్ కోసం కీచులాడుకోవడం ప్రజలకు తప్పుడు సంకేతాలు పంపిస్తున్నాయనే సంగతి వారు ఇంకా గ్రహించినట్లు లేదు. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల తరువాత 11 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తెరాసలోకి ఫిరాయించడంతో ఆ పార్టీ చాలా బలహీనపడింది. అదొక నష్టం అనుకుంటే, ఆ కారణంగా ఒకవేళ కాంగ్రెస్ అభ్యర్ధిని గెలిపించినా అతను లేదా ఆమె తెరాసలో చేరకుండా ఉంటారా?అనే అనుమానాలు ప్రజలలో ఉన్నాయి. ఇదే కాంగ్రెస్ పార్టీ పాలిట శాపంగా మారవచ్చు. ఇటువంటి ఎన్నికల ఎదుర్కోవడంలో దానికి ఉన్న నేర్పు, శక్తిసామర్ధ్యాలు మరే పార్టీకి లేవనే చెప్పవచ్చు. ప్రస్తుతం రాష్ట్రంలో తెరాసయే అధికారంలో ఉంది. ఎన్నికల విషయంలో తెరాస పిహెచ్‌డి చేసినట్లు చెప్పుకోవచ్చు. సహజంగానే ప్రజలు పార్టీవైపు మొగ్గు చూపే అవకాశాలు ఎక్కువ. కనుక హుజూర్‌నగర్‌ టికెట్ కోసం పోటీ పడుతున్నవారు కాస్త ఆలోచించుకుంటే వారికే మంచిదేమో? కాంగ్రెస్‌, తెరాసల అభ్యర్ధులు ఎవరో దాదాపు స్పష్టమైంది. కానీ తెరాసకు తామే ప్రత్యామ్నాయమని చెప్పుకొంటున్న బిజెపి ఇంకా అభ్యర్ధిని ప్రకటించవలసి ఉంది. హుజూర్‌నగర్‌ ఉపఎన్నికల షెడ్యూల్:  

నోటిఫికేషన్‌: సెప్టెంబర్ 23

నామినేషన్లు దాఖలు చేయడానికి చివరి తేదీ: సెప్టెంబర్ 30

నామినేషన్ల పరిశీలన: అక్టోబర్ 1

ఉపసంహరణకు గడువు: అక్టోబర్ 3

పోలింగ్: అక్టోబర్ 21

కౌంటింగ్ మరియు ఫలితాల ప్రకటన: అక్టోబర్ 24.


Related Post