పార్టీ ఫిరాయింపులపై కేటీఆర్‌ జవాబు

September 20, 2019


img

ఈరోజు అసెంబ్లీ సమావేశంలో పార్టీ ఫిరాయింపులపై మునుగోడు కాంగ్రెస్‌ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డికి, మంత్రి కేటీఆర్‌కు మద్య తీవ్రస్థాయిలో వాగ్వాదం సాగింది. ముందుగా రాజగోపాల్ రెడ్డి ఈ ప్రస్తావన చేస్తూ, “తెరాసకు ప్రజాస్వామ్యంపై నమ్మకం, గౌరవం లేవు. అందుకే ప్రతిపక్షాల సభ్యులను తెరాసలోకి ఫిరాయింపజేసుకొని రాష్ట్రంలో రాజకీయాలను భ్రష్టు పట్టించి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసింది,” అని అన్నారు. 

మంత్రి కేటీఆర్‌ వెంటనే లేచి రాజగోపాల్ రెడ్డికి ఘాటుగా జవాబిచ్చారు. 2004లో తెరాస ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నప్పుడు మీకు ప్రజాస్వామ్యం గుర్తుకు రాలేదా? రాజస్థాన్‌లో మీ పార్టీకి మద్దతు ఇచ్చిన బీఎస్పీ ఎమ్మెల్యేలను రెండు రోజుల క్రితమే కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసుకోలేదా? మీరు చేస్తే ఒప్పు...అదే మేము చేస్తే తప్పా? మీకో నీతి మాకో నీతా?ప్రజాస్వామ్యం గురించి కాంగ్రెస్‌ నేతలు మాట్లాడుతుంటే జనాలు నవ్వుతారు. మీకేమైనా అభ్యంతరాలు ఉంటే నిరభ్యంతరంగా కోర్టుకు వెళ్లవచ్చు,” అని జవాబిచ్చారు. 

తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాలలో దేశానికే ఆదర్శంగా ఉందని గొప్పగా చెప్పుకునే తెరాస నేతలు రాజకీయాలలో కూడా ఆదర్శంగా వ్యవహరించి ఉంటే నేడు ఎవరూ ఈవిధంగా వేలెత్తి చూపగలిగేవారు కాదు. ఆదర్శంగా ఉండలేకపోయినా పరువాలేదు కానీ ఇతరపార్టీలు తప్పులు చేస్తున్నాయి కనుక మనం కూడా తప్పు చేయవచ్చనుకోవడం... మళ్ళీ దానిని ఈవిధంగా సమర్ధించుకోవడం సరికాదు. 

రాజకీయాలలో ఉన్నవారు నైతికంగా ఎన్ని మెట్లు దిగితే అంతకు అంతా వారే నష్టపోతారని మన రాజకీయపార్టీల చరిత్ర చూస్తే అర్ధమవుతుంది. ఉదాహరణకు పొరుగునే ఉన్న ఏపీలో ఐదేళ్ళపాటు చంద్రబాబునాయుడు చెప్పిందే వేదం అన్నట్లుగా నడిచింది. కానీ ప్రజలు ఆయనను తిరస్కరించి జగన్‌ను ఎన్నుకోవడంతో ఇప్పుడు ఆయనతో సహా టిడిపి నేతలు ఎన్ని అగచాట్లు పడుతున్నారో అందరూ చూస్తూనే ఉన్నారు. మళ్ళీ రేపు టిడిపి అధికారంలోకి వస్తే అప్పుడు జగన్‌, వైసీపీ నేతలకు ఇటువంటి పరిస్థితే ఎదురవుతుంది. అంటే రాజకీయాలలో ఉన్నవారు ఒక్కో మెట్టు దిగుతుంటే చివరికి బురదలో కూరుకుపోక తప్పదన్న మాట. ఇది అన్ని పార్టీలకు వర్తిస్తుంది. కనుక రాజకీయాలలో ఉన్నవారు హుందాగా వ్యవహరిస్తూ ప్రజాస్వామ్యానికి కట్టుబడి ఉన్నట్లయితే ఇటువంటి విమర్శలు, భవిష్యత్‌లో సమస్యలు ఎదుర్కోవలసిన అవసరం ఉండదు.


Related Post