కోడెల మృతికి ఎవరు కారకులు?

September 17, 2019


img

మాజీ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. టిడిపి అధినేత చంద్రబాబునాయుడుతో సహా ఆ పార్టీ నేతలు జగన్ ప్రభుత్వం వేధింపుల కారణంగానే కోడెల తీవ్రమానసిక క్షోభకు గురై, ఆ ఒత్తిళ్ళు, అవమానాలు భరించలేక ఆత్మహత్య చేసుకున్నారని వాదిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన కోట్లు విలువచేసే అసెంబ్లీ ఫర్నీచర్‌ను ఆయన తన ఇంటికి తరలించుకుపోయినందుకు పోలీసులు ఆయనపై కేసు నమోదుచేసిన మాట వాస్తవం. ఆయన చేసింది తప్పే కనుక ఆవిషయం బయటకు పొక్కడంతో కోడెల ప్రతిష్ట మసకబారింది. 

ఇదికాక ‘కోడెల కుటుంబ సభ్యులు తమను వేధించేవారంటూ’ ఇటీవల కొందరు వ్యక్తులు పోలీస్ స్టేషన్లలో పిర్యాదులు చేయడంతో వాటిపై కూడా కేసులు నమోదు అయ్యాయి. ఈ కేసుల కారణంగా కోడెల తీవ్ర ఒత్తిడి, మానసిక క్షోభకు గురై ఉండవచ్చు. కనుక జగన్ ప్రభుత్వం కోడెల కుటుంబంపై చిల్లరకేసులు పెట్టి వేధించినందునే ఆత్మహత్య చేసుకున్నారని, ఆయనను ఆత్మహత్య చేసుకునేంతగా జగన్ ప్రభుత్వం వెంటపడి వేదించిందని చంద్రబాబునాయుడు ఆరోపిస్తున్నారు. ఇది జగన్ ప్రభుత్వం చేసిన హత్యగానే భావించి ప్రభుత్వంపై కేసు నమోదుచేయాలని డిమాండ్ చేస్తున్నారు. 

జగన్ అధికారం చేపట్టినప్పటి నుంచి టిడిపి కార్యకర్తలపై దాడులు, వేధింపులు పెరిగిపోయాయంటూ ఆరోపిస్తున్న టిడిపి ఇటీవల వైసీపీ బాధితుల శిబిరం కూడా నిర్వహించి ‘చలో ఆత్మకూరు’ ర్యాలీకి సిద్దం అయింది కానీ దానిని పోలీసులు అడ్డుకున్నారు. 

ఇక కోడెల కుమారుడు శివరాం ఆస్తుల పంపకాల కోసం తండ్రితో తరచూ గొడవపడుతున్నాడని, కూతురు కూడా కోడెలపై ఒత్తిడి చేస్తుండేవారనే మరో వాదన కూడా వినిపిస్తోంది. రాజకీయంగా కోడెల ఎంతో ఉన్నతస్థాయికి ఎదిగినప్పటికీ తన కోసం భారీగా ఆస్తులు పోగేయలేకపోయినందుకు శివరాం తండ్రిని రోజూ దుర్భాషలాడేవారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అవి భరించలేకనే కోడెల ఆత్మహత్య చేసుకున్నారనే వాదన వినిపిస్తోంది. 

కనుక కోడెల ఆత్మహత్యకు కారకులు ఎవరు? జగన్ ప్రభుత్వమా లేక కోడెల కుటుంబ సభ్యులేనా? అనే విషయం తెలియాల్సి ఉంది. కానీ అది ఆయనతో పాటే సమాధి కావచ్చు.


Related Post