మరో 15ఏళ్ళ వరకు నేనే సిఎం: కేసీఆర్‌

September 16, 2019


img

శాసనసభలో రాష్ట్ర బడ్జెట్‌పై ఆదివారం జరిగిన సాధారణ చర్చలో సిఎం కేసీఆర్‌ మాట్లాడుతూ, “నా ఆరోగ్యం క్షీణిస్తోందని, కనుక త్వరలో నా కుమారుడు కేటీఆర్‌ను ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెట్టబోతున్నానని కొందరు పుకార్లు పుట్టిస్తున్నారు. నా ఆరోగ్యానికేమీ కాలేదు. పూర్తి ఆరోగ్యంతో మీ అందరి కళ్ల ముందే ఉన్నాను...అందరూ చూస్తూనే ఉన్నారు కదా? కనుక ఈ ఐదేళ్ళు కాకుండా మరో 10 ఏళ్ళపాటు నేనే తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పాలించగల సత్తా నాకు ఉంది. రాష్ట్రంలో మరో 15 ఏళ్ళపాటు తెరాసయే అధికారంలో ఉంటుంది,” అని అన్నారు. 

మనదేశంలో అధికారంలో ఉండే అన్ని పార్టీలకు తామే శాస్వితంగా అధికారంలో కొనసాగాలనే బలమైన కోరిక ఉంటుంది. గతంలో నాయకులు తమ మనసులో ఉన్న ఈ కోరికను బయటకు చెపితే ప్రజలు నవ్వుతారనే భయంతో ఎవరూ ఇలా బయటకు చెప్పేవారుకాదు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారడంతో తెరాసతో సహా అన్ని పార్టీలు ఎప్పటికీ మేమే అధికారంలో ఉండాలనుకుంటున్నామని బహిరంగంగానే చెప్పుకొంటున్నాయి. 

ఏపీలో చంద్రబాబునాయుడు కూడా ఇలాగే కోరుకున్నారు. కానీ ప్రజలు ఆయనను నిర్ధాక్షిణ్యంగా దించేసి జగన్‌కు అధికారం అప్పజెప్పారు. ఇప్పుడు జగన్ కూడా తానే ఏపీలో శాస్వితంగా అధికారంలో ఉండిపోవాలని కోరుకొంటున్నారు. కానీ అది సాధ్యం కాదని ఆయన కూడా గ్రహించినట్లు లేదు. 

మన ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజల అభిమానం, ఆదరణ ఉన్నంతకాలమే ఎవరైనా అధికారంలో కొనసాగే అవకాశం ఉంటుంది లేకుంటే దిగిపోక తప్పదనే సంగతి అన్ని పార్టీలకు తెలుసు. అయినా శాస్వితంగా అధికారంలో కొనసాగాలనే కోరిక వారిలో పోదు. తాను కూడా అందుకు అతీతుడిని కానని కేసీఆర్‌ స్వయంగా చెప్పుకున్నారు. అది సాధ్యమో కాదో కాలమే చెపుతుంది. 



Related Post