కేంద్రప్రభుత్వం ప్రవేశపెడుతున్న ‘ఒకే దేశం..ఒకే రేషన్ కార్డ్’ పధకంలో తెలంగాణ రాష్ట్రం కూడా చేరింది. ఈ పధకం ద్వారా రేషన్ కార్డు కలిగిన వ్యక్తులు దేశంలో ఏ రాష్ట్రంలో... ఏ ప్రాంతంలోని రేషన్ షాపు నుంచైనా నెలవారి రేషన్ సరుకులు తీసుకునే వెసులుబాటు కలుగుతుంది. పొట్ట చేత్తో పట్టుకొని పొరుగు రాష్ట్రాలకు లేదా నగరాలకు పట్టణాలకు వలసలు వెళ్ళే నిరుపేద కార్మికుల కష్టాలను దృష్టిలో పెట్టుకొని కేంద్రప్రభుత్వం ఈ పధకానికి శ్రీకారం చుట్టింది. జూలై 1, 2020 నాటికల్లా దేశమంతటా ఈ పధకాన్ని అమలులోకి తీసుకురావలనేది కేంద్రప్రభుత్వం లక్ష్యం కాగా ఇప్పటికే ఏపీ, తెలంగాణ, కేరళ, కర్ణాటక, గుజరాత్, మహారాష్ట్ర, హర్యానా, ఝార్ఖండ్,త్రిపుర రాష్ట్రాలు ఈ పధకాన్ని అమలుచేసేందుకు అంగీకారం తెలిపాయి. వాటిలో మొట్టమొదటిగా తెలంగాణ రాష్ట్రంలో నేటి నుంచి ఈ పధకాన్ని ‘ట్రయల్ రన్’గా నిర్వహించి చూశారు. ఈరోజు ఆంధ్రా నుంచి హైదరాబాద్‌కు వలసవచ్చిన పేదప్రజలు నగరంలోని రేషన్ దుకాణాల నుంచి రేషన్ సరుకులు తీసుకున్నారు. ఆగస్ట్ 1వ తేదీ నుంచి ఏపీ, తెలంగాణ రాష్ట్రాలతో సహా నాలుగు రాష్ట్రాలలో ఈ పధకాన్ని వర్తింపజేయనున్నారు.
అయితే ఈ పధకంలో కేంద్రప్రభుత్వం అందిస్తున కిలో రూ.3 బియ్యం, కిలో రూ.2 గోధుమలు మాత్రమే ప్రస్తుతం లభిస్తాయి. అదేవిధంగా ఒక రాష్ట్రంలో లభిస్తున్న ఉచితసరుకులు ఇతర రాష్ట్రాలవారికి లభించవు. రానున్న కాలంలో ఈ పధకంలో లోటుపాట్లను సవరించి, మెరుగులు దిద్దిన తరువాత అన్ని రాష్ట్రాలలో ఒకే విధంగా రేషన్ సరుకులు ఇచ్చే విధానం ప్రవేశపెట్టవచ్చునని సమాచారం. రాష్ట్రంలోని ఇతర జిల్లాలు లేదా పట్టణాలకు లేదా హైదరాబాద్ నగరానికి వలసలు వెళుతున్న తెలంగాణ ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న రేషన్ సరుకులన్నీ ఎక్కడి నుంచైనా తీసుకునే వెసులుబాటు కల్పించిన సంగతి అందరికీ తెలిసిందే.