విశాఖలో ఏఏఏ సినిమాస్‌.. అల్లు అర్జున్‌ ప్రారంభోత్సవం

August 09, 2026


img

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ నేడు విశాఖ నగరంలోని ఇన్‌ఆర్బిట్‌ మాల్‌లో నిర్మించిన ఏఏఏ సినిమాస్‌ను ప్రారంభించారు. హైదరాబాద్‌లోని అమీర్‌పేటలో ఇప్పటికే ఏఏఏ సినిమాస్‌ పేరుతో ఓ మల్టీప్లెక్స్‌ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ జాబితాలో విశాఖలోని ఇది కూడా చేరింది. 

విశాఖ ఇన్‌ఆర్బిట్‌ మాల్‌లో నిర్మించిన ఈ మల్టీప్లెక్స్‌లో మొత్తం ఎనిమిది స్క్రీన్లు ఉన్నాయి. వీటిలో అతిపెద్ద స్క్రీన్‌ 70 ×30 అడుగులతో 491 మంది ప్రేక్షకులు కూర్చునే సామర్థ్యం కలిగి ఉంది. దీనిలో భారీ ఎల్‌ఈడీ స్క్రీన్‌తో పాటు డాల్బీ అట్మాస్‌ సౌండ్‌ సిస్టమ్‌ను ఏర్పాటు చేశారు. ఈ అతిపెద్ద స్క్రీన్‌ను సెప్టెంబర్‌లో ప్రేక్షకులకు అందుబాటులోకి తీసుకువస్తామని అల్లు అర్జున్‌ చెప్పారు. 

మిగిలిన స్క్రీన్లలోనూ ఆధునిక లేజర్‌ ప్రొజెక్షన్‌, అధునాతన సౌండ్‌ సిస్టమ్‌, ప్రీమియం సీటింగ్‌ వంటి సదుపాయాలను ఏర్పాటు చేశారు. విశాఖ ప్రేక్షకులకు అంతర్జాతీయ స్థాయి సినిమా అనుభూతిని అందించాలనే లక్ష్యంతో ఈ మల్టీప్లెక్స్‌ను రూపొందించారు.

ఇప్పటికే వందలాది బ్రాండ్లతో అందుబాటులోకి వచ్చిన ఇన్‌ఆర్బిట్‌ మాల్‌కు ఏఏఏ సినిమాస్‌ మరో ప్రధాన ఆకర్షణగా మారనుంది. 

అల్లు అర్జున్‌ విశాఖకు వచ్చినప్పుడు ఆయన అభిమానులు భారీ సంఖ్యలో విమానాశ్రయం చేరుకున్నారు. దారి పొడవునా ఆయనకు స్వాగతం పలికారు. ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత అల్లు అర్జున్‌ అభిమానులతో ఫోటోలు దిగారు. అనంతరం ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌ తిరిగి బయలుదేరారు.


Related Post

సినిమా స‌మీక్ష