తెరాస ఎమ్మెల్సీలకు హైకోర్టు షాక్

July 10, 2019


img

కాంగ్రెస్‌లో చేరిన తెరాస ఎమ్మెల్సీలు రాములు నాయక్, యాదవ్ రెడ్డిలకు హైకోర్టు షాక్ ఇచ్చింది. మండలి ఛైర్మన్ వారిపై అనర్హత వేటు వేయడం రాజ్యాంగబద్దమేనని స్పష్టం చేసింది. అయితే హైకోర్టు తీర్పుపై తాము సుప్రీంకోర్టులో అప్పీలు చేసుకోవాలని భావిస్తున్నందున అంతవరకు తమ రెండు స్థానాలకు ఎన్నికలు నిర్వహించకుండా ఈసీని ఆదేశించాలనే వారి అభ్యర్ధనపై హైకోర్టు సానుకూలంగా స్పందించింది. వారి అభ్యర్ధనను పరిశీలించవలసిందిగా రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కోరింది.     

స్పీకర్ లేదా మండలి ఛైర్మన్ తమ పార్టీ రాజకీయ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఫిరాయింపుల చట్టాన్ని అమలుచేయాలనుకున్నా, వద్దనుకున్నా న్యాయస్థానాలు ఏమీ చేయలేవని ఇప్పటికే పలుమార్లు రుజువైంది. ఇప్పుడు మరోమారు రుజువైందను కోవచ్చు. 

ఫిరాయింపుచట్ట ప్రకారం పార్టీ ఫిరాయించిన ప్రజాప్రతినిధులపై చర్యలు తీసుకునే హక్కు, అధికారం వారికుంది కనుక న్యాయవ్యవస్థలు వారి నిర్ణయాలను అడ్డుకోలేవు. ఒకవేళ వారు ఆ చట్టాన్ని అమలుచేయకూడదనుకున్నా వారి పరిధిలో ఉన్న ఈ వ్యవహారాలలో న్యాయస్థానాలకు జోక్యం చేసుకొనే అధికారం లేనందున చర్యలు తీసుకోలేని నిస్సహాయస్థితిలో ఉండిపోతున్నాయి. 

ఇద్దరు ఎమ్మెల్సీలపై మండలి ఛైర్మన్ అనర్హత వేటువేయడం రాజ్యాంగబద్దమే కనుక హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు కూడా సమర్ధించడం ఖాయం. మరికొన్ని రోజులు ఎమ్మెల్సీలుగా కొనసాగడానికి మాత్రమే అప్పీలు పనికివస్తుందని భావించవచ్చు.


Related Post