అవును..తెలంగాణ ప్రజలకు భరోసా కల్పించింది కేసీఆరే

July 02, 2019


img

మంత్రి జగదీష్ రెడ్డి మంగళవారం నల్గొండలో మీడియాతో మాట్లాడుతూ, “సమైక్య పాలనలో నలిగిపోయిన తెలంగాణను, తెలంగాణ ప్రజలను కాపాడుకునేందుకే సిఎం కేసీఆర్‌ తెరాసను స్థాపించి అలుపెరుగని పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారు. తెలంగాణ ఏర్పడి, కేసీఆర్‌ ముఖ్యమంత్రి అయిన తరువాత రాష్ట్రం అభివృద్ధికి నోచుకొంటోంది. ప్రజలలో మళ్ళీ ఆత్మవిశ్వాసం తొణికిసలాడుతోంది. ఆ నమ్మకం, భరోసా కల్పించినందుకే రాష్ట్ర ప్రజలు తెరాసను ఇంతగా ఆదరిస్తున్నారు. కానీ నేటికీ తెలంగాణాభివృద్ధిని అడ్డుకునేందుకు కుట్రలు, కుతంత్రాలు జరుగుతూనే ఉండటం చాలా బాధాకరం. సిఎం కేసీఆర్‌ వాటన్నిటినీ ధైర్యంగా ఎదుర్కొంటూ అకుంటిత దీక్షతో రాష్ట్రాభివృద్ధికి పాటుపడుతున్నారు. 

కేంద్రంలో, సమైఖ్య రాష్ట్రంలో 10 ఏళ్ళు అధికారంలో ఉండి ఏమీ చేయలేకపోయిన కాంగ్రెస్ పార్టీ, మా ప్రభుత్వంపై విమర్శలు చేస్తుండటం హాస్యాస్పదంగా ఉంది. కాంగ్రెస్‌ హయాంలో ప్రాజెక్టు పనులు దశాబ్ధాలపాటు సాగుతుండేవి కానీ ఎప్పటికీ పూర్తయ్యేవి కావు. కానీ మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కేవలం మూడేళ్ళలోనే కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేస్తున్నాము. మా పట్టుదల, చిత్తశుద్ధికి ఇదే ఒక నిదర్శనం. రాష్ట్రానికి సంపద సృష్టించి దానిని మళ్ళీ ప్రజలకే పంచిపెట్టడమే లక్ష్యంగా మా ప్రభుత్వం పనిచేస్తోంది. ప్రజలు మాపై ఉంచిన నమ్మకాన్ని వమ్ముచేయకుండా పనిచేస్తాము,” అని అన్నారు. 

తెలంగాణ సంస్కృతిసాంప్రదాయాలను, పండుగల ప్రాశస్త్యాన్ని లోకానికి చాటి చెప్పిన క్రెడిట్ ఖచ్చితంగా సిఎం కేసీఆర్‌కే దక్కుతుంది. అలాగే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనతికాలంలోనే రాష్ట్రానికి ఒక ఓ ప్రత్యేక గుర్తింపు, ప్రజలకు ఆత్మగౌరవాన్ని కల్పించిన ఘనత కూడా కేసీఆర్‌కే దక్కుతుంది. మంత్రి జగదీష్ రెడ్డి చెప్పినట్లుగా తెలంగాణ ఏర్పడి తెరాస అధికారంలోకి వచ్చినప్పటి నుంచే రాష్ట్రంలో ఈ పెనుమార్పులు సంభవించడం ప్రారంభం అయ్యాయనడంలో       ఏమాత్రం సందేహంలేదు. సిఎం కేసీఆర్‌ వైఖరిని, విధానాలను ప్రతిపక్షాలు ఎంతగా విమర్శిస్తున్నప్పటికీ తెలంగాణ ప్రజలు తెరాసవైపే మొగ్గు చూపడానికి ఇవే కారణాలని చెప్పవచ్చు. 



Related Post