బిజెపి అప్పుడే పని మొదలుపెట్టేసిందా?

May 29, 2019


img

పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికల ప్రచారసభలలో పాల్గొన్నప్పుడు ప్రధాని నరేంద్రమోడీ ఒక సంచలన ప్రకటన చేశారు. అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన 40 మంది ఎమ్మెల్యేలు తమతో టచ్చులో ఉన్నారని లోక్‌సభ ఫలితాలు వెలువడిన తరువాత వారందరూ బిజెపిలో చేరిపోవచ్చునని అన్నారు. ప్రధాని స్థాయిలో ఉన్న వ్యక్తి ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నట్లుగా, ప్రజలేనుకొన్న ప్రభుత్వాలను కూల్చివేస్తామన్నట్లుగా మాట్లాడటంపై సర్వత్రా విమర్శలు వచ్చాయి. 

ఆ విమర్శలను బిజెపి నేతలెవరూ పెద్దగా పట్టించుకోలేదు కానీ నరేంద్రమోడీ మళ్ళీ రెండవసారి ప్రధానిగా ఇంకా ప్రమాణస్వీకారం చేయకమునుపే వారు పశ్చిమబెంగాల్లో ‘పని’ మొదలెట్టేసినట్లు కనిపిస్తోంది. తృణమూల్ ఎమ్మెల్యేలు శుభ్రాంషు రాయ్(బిజ్ పూర్), సునీల్ సింగ్ (నౌపారా), సిపిఎం ఎమ్మెల్యే శీల్ భద్ర దత్తా (బారక్ పూర్)లతో పాటు ఏకంగా 60 మంది మున్సిపల్ కౌన్సిలర్లు మంగళవారం డిల్లీకి వెళ్ళి బిజెపిలో చేరిపోయారు. 

పశ్చిమబెంగాల్లో గల 42 సీట్లలో 18 సీట్లను గెలుచుకొని ఆ రాష్ట్రంలో బిజెపి అడుగుపెట్టింది కనుక అక్కడ పార్టీని బలోపేతం చేసుకొని అధికారం చేజిక్కించుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేయడం తధ్యం. కనుక ఈ ఫిరాయింపులు ఆరంభం మాత్రమేనని చెప్పవచ్చు. అంటే మమతా సర్కార్ నెత్తిపై బిజెపి కత్తి వ్రేలాడుతున్నట్లే భావించవచ్చు. మరి ఆమె తన ప్రభుత్వాన్ని ఏవిధంగా కాపాడుకొంటారో చూడాలి.


Related Post