ప్రధాని కావల్సిన వ్యక్తిని చంద్రబాబు...మోత్కుపల్లి

May 28, 2019


img

ఏపీలో టిడిపి ఘోరపరాజయం పొందడంతో రాంగోపాల్ వర్మ, లక్ష్మీపార్వతి, మోత్కుపల్లి నర్సింహులు, మోహన్ బాబు వంటి శత్రువులందరూ చంద్రబాబునాయుడుపై తీవ్రవిమర్శలు చేస్తున్నారు. టిడిపి వ్యవస్థాపక సభ్యులలో ఒకరైన మాజీ టిడిపి నేత మోత్కుపల్లి నర్సింహులు కూడా చంద్రబాబునాయుడుపై తీవ్ర విమర్శలు చేశారు. 

ఈరోజు స్వర్గీయ ఎన్టీఆర్ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్‌కు వచ్చి నివాళులు అర్పించిన తరువాత మీడియాతో మాట్లాడుతూ, “ బడుగుబలహీనవర్గాలకు కూడా రాజ్యాధికారం కల్పించిన మహనీయుడు స్వర్గీయ ఎన్టీఆర్. దేశానికి ప్రధాని కావలసిన ఆ మహనీయుడికి చంద్రబాబునాయుడు వెన్నుపోటు పొడిచి పొట్టన పెట్టుకొన్నారు. కానీ చెట్టుపేరు చెప్పి కాయలు అమ్ముకొన్నట్లు తన రాజకీయ మనుగడ కోసం ఆయన పేరు చెప్పుకొంటున్నారు. ఏపీ ప్రజలు చంద్రబాబునాయుడుకి ఎన్నికలలో బాగానే బుద్ది చెప్పారు. ఇప్పుడు ఎన్టీఆర్ ఘోష తీరింది. ఆయన ఆత్మ శాంతిస్తుంది. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బడుగుబలహీనవర్గాలకు మేలుచేస్తారని ఆశిస్తున్నాను,” అని అన్నారు.

సరిగ్గా ఏడాది క్రితం ఇదే రోజున మోత్కుపల్లి నర్సింహులు ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించిన తరువాత మీడియాతో మాట్లాడుతూ, “తెలంగాణలో టిడిపికి భవిష్యత్ లేదు కనుక టిడిపిని తెరాసలో విలీనం చేసేయాలి,” అని చంద్రబాబునాయుడుకు ఉచితసలహా ఇచ్చారు. అయితే మోత్కుపల్లి సలహాపై తీవ్ర ఆగ్రహం చెందిన చంద్రబాబునాయుడు ఆయనను పార్టీ నుంచి బహిష్కరించారు. కానీ ఆ తరువాత మోత్కుపల్లి చెప్పినట్లుగానే తెరాసతో పొత్తుకు చంద్రబాబునాయుడు ప్రయత్నించి భంగపడ్డారు. బాబుతో మళ్ళీ చేతులు కలపడానికి సిఎం కేసీఆర్‌ నిరాకరించడంతో ఆయన తన బద్దశత్రువైన కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపారు.     

ఒకవేళ తెలంగాణలో కాంగ్రెస్‌-టిడిపి కూటమి అధికారం లోకి వచ్చి ఉండి ఉంటే రాష్ట్రంలో టిడిపి మళ్ళీ పుంజుకొని ఉండేదేమో కానీ ఓడిపోవడంతో టిడిపి మరింత బలహీనపడటమే కాకుండా కేసీఆర్‌ ఆగ్రహానికి గురై ఏపీలో కూడా అధికారం కోల్పోయింది. ఇప్పుడు రెండు రాష్ట్రాలలో టిడిపి పరిస్థితి ఆగమ్యగోచరంగా మారింది.


Related Post