ఏపీలో కూడా టిడిపికి కష్టకాలం మొదలైందా?

May 28, 2019


img

లోక్‌సభ, ఏపీ అసెంబ్లీ ఎన్నికలలో టిడిపి ఓడిపోవడంతో తెలంగాణ టిడిపి అధ్యక్షుడు ఎల్ రమణ, టిటిడిపి నేతలు సోమవారం అమరావతికి వెళ్ళి చంద్రబాబునాయుడు విచారం తెలిపారు. ఈ సందర్భంగా తెలంగాణ లోక్‌సభ ఫలితాలపై కూడా వారు చర్చించారు. 

2014 ఎన్నికలలో తెలంగాణలో టిడిపి ఓడిపోయినప్పటికీ, రాష్ట్రంలో చాలా బలంగానే ఉందని నిరూపించుకొంది. కానీ ఆ తరువాత ఫిరాయింపులతో పూర్తిగా బలహీనడింది. అయినప్పటికీ రాష్ట్రంలో టిటిడిపిని మళ్ళీ నిలబెట్టేందుకు చంద్రబాబునాయుడు తమ బద్దశత్రువైన కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపి తెరాసకు షాక్ ఇచ్చారు. అప్పుడు సిఎం కేసీఆర్‌ “కాంగ్రెస్‌-టిడిపి కూటమికి ఓట్లు వేస్తే రాష్ట్రం మళ్ళీ పరాయిపాలన క్రిందకు వెళ్ళిపోతుందనే” వాదనతో ప్రజలను మెప్పించి ఒప్పించి వారి కూటమిని ముందస్తు అసెంబ్లీ ఎన్నికలలో చిత్తుచిత్తుగా ఓడించారు. దాంతో తెలంగాణ రాష్ట్రంలో టిడిపి పరిస్థితి మళ్ళీ మొదటికొచ్చింది. 

ఈ నేపధ్యంలో ఏపీలో కూడా టిడిపి ఓడిపోవడం, అధికారంలోకి వస్తున్న జగన్‌ కూడా టిడిపి పట్ల తెరాస విధానాలనే అమలుచేసే సూచనలు కనిపిస్తుండటంతో ఇప్పుడు ఏపీటిడిపి కూడా తన మనుగడ కోసం గట్టిగా పోరాడవలసిరావచ్చు. ఒకవేళ జగన్‌మోహన్‌రెడ్డిని, వైసీపీ ధాటిని తట్టుకొని నిలబడలేకపోతే ఏపీటిడిపి పరిస్థితి కూడా టిటిడిపిలాగే మారవచ్చు.


Related Post