రాహుల్ నిర్ణయం సరైనదే

May 28, 2019


img

ఈసారి లోక్‌సభ ఎన్నికల కాంగ్రెస్‌ అధిష్టానం తమ బలాన్ని, వాస్తవిక రాజకీయ పరిస్థితులను సరిగ్గానే అంచనావేసింది కనుకనే ఎన్నికలలో గెలిచి సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని కలగనకుండా ప్రాంతీయ పార్టీల మద్దతుతో కేంద్రప్రభుత్వం ఏర్పాటు చేయాలని ఆశపడింది. దేశంలో అందుకు అనుకూలమైన వాతావరణం కూడా ఏర్పడింది కనుక ఈసారి కాంగ్రెస్‌ మిత్రపక్షాలు అధికారంలోకి రావచ్చనుకొన్నారు. కానీ బిజెపి తిరుగులేని మెజార్టీతో అనూహ్యంగా విజయం సాధించడంతో దేశంలో ప్రాంతీయ పార్టీలు కూడా షాక్ అయ్యాయి.

కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఈ ఫలితాలను, పార్టీ ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నారు. పార్టీలో సీనియర్ నేతలు అలసత్వం ప్రదర్శించడం వలననే పార్టీ ఇంత దారుణంగా ఓడిపోయిందని ఆవేదన ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ ఓటమికి నైతికబాధ్యత వహిస్తూ కాంగ్రెస్‌ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తానని రాహుల్ గాంధీ పట్టుపడుతున్నప్పటికీ బహుశః కాంగ్రెస్‌ నేతలపై ఆగ్రహంతోనే ఇటువంటి కటినమైన నిర్ణయం తీసుకొన్నారని భావించవచ్చు. తన స్థానంలో ప్రియాంకా వాద్రాను కాకుండా నెహ్రూ కుటుంబానికి చెందని బయటి వ్యక్తులను ఎవరినైనా కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా నియమించాలని సూచిస్తున్నారు.

రాహుల్ గాంధీ చాలా మంచి నిర్ణయం తీసుకొన్నారనే చెప్పవచ్చు. కాంగ్రెస్ పార్టీలో కొత్త నాయకత్వం వస్తే కొత్త ఆలోచనలు, కొత్త విధానాలు వస్తాయి కనుక కాంగ్రెస్ పార్టీ మళ్ళీ పునరుజ్జీవం పొందే అవకాశం ఉంది. కానీ కొత్త అధ్యక్షుడుని స్వతంత్రంగా స్వేచ్ఛగా పనిచేసుకోనిస్తేనే ఏమైనా మార్పు కనిపిస్తుంది. ఆలాకాక గతంలో డాక్టర్ మన్మోహన్ సింగ్ ప్రభుత్వాన్ని సోనియాగాంధీ రిమోట్ పరిపాలన చేసినట్లుగా పేరుకు కొత్త అధ్యక్షుడుని నియమించుకొని మళ్ళీ సోనియా, రాహుల్, ప్రియాంకా వాద్రాలు ముగ్గురూ పార్టీని నడిపించాలనుకొంటే ఎటువంటి ప్రయోయజనమూ ఉండదు. ఇంతకీ రాహుల్ గాంధీ తన నిర్ణయానికి కట్టుబడి ఉంటారో ఏదో చూడాలి.


Related Post