వారసులపై కాంగ్రెస్‌ వారసుడు కన్నెర్ర!

May 27, 2019


img

కాంగ్రెస్ అధ్యక్ష పదవి, అవకాశం చిక్కితే ప్రధానమంత్రి పదవి పొందడం తన వారసత్వహక్కుగా భావించే ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, శనివారం డిల్లీలో జరిగిన కాంగ్రెస్‌ వర్కింగ్ కమిటీ సమావేశంలో ఇద్దరు కాంగ్రెస్‌ ముఖ్యమంత్రులు, ఒక సీనియర్ కాంగ్రెస్‌ నేత తమ వారసులకు టికెట్లు ఇప్పించుకోవడాన్ని తప్పు పట్టారు. 

ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికలలో మధ్యప్రదేశ్ సిఎం కమల్ నాథ్, రాజస్థాన్ సిఎం అహోక్ గెహ్లాట్, మాజీ కేంద్రమంత్రి పి.చిదంబరం ముగ్గురూ తమ కొడుకులకు టికెట్ ఇవ్వాలని తనపై ఒత్తిడి చేశారని, తాను వారికి టికెట్లు కేటాయిస్తే వారు తమ వారసుల నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారానికే పరిమితమయ్యి రాష్ట్రంలో మిగిలిన నియోజకవర్గాలను పట్టించుకోలేదని, ఆ కారణంగా కాంగ్రెస్ పార్టీ చాలా నష్టపోయిందని రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

తాను ఒక్కడినే దేశమంతా పర్యటిస్తూ ఎన్నికల ప్రచారం చేస్తుంటే పార్టీలో సీనియర్ నేతలు తమకు సంబందం లేదన్నట్లు వ్యవహరించడం వలననే కాంగ్రెస్ పార్టీ ఈసారి దారుణంగా పరాజయం పాలైందని రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఈ సమావేశంలో పాల్గొన్న ఏఐసిసి కార్యదర్శి ప్రియాంకా వాద్రా కూడా సీనియర్ కాంగ్రెస్‌ నేతలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేయడానికి సిద్దపడిన రాహుల్ గాంధీని ఆమె గట్టిగా వారించినట్లు తెలుస్తోంది. ఆవిధంగా చేస్తే నరేంద్రమోడీ విసిరిన ఉచ్చులో చిక్కుకొన్నట్లవుతుందని ఆమె వాదించినట్లు తెలుస్తోంది. 

వారసులకు టికెట్లు కేటాయించుకోవడంపై కాంగ్రెస్‌ వారసుడు రాహుల్ గాంధీ అసంతృప్తి వ్యక్తం చేయడం చాలా విడ్డూరంగా ఉంది. ఒకటి రెండు ఎన్నికలు మినహాయిస్తే 2014 నుంచి ఇప్పటి వరకు జరిగిన ప్రతీ ఎన్నికలలోను కాంగ్రెస్ పార్టీ దారుణంగా ఓడిపోతూనే ఉంది. కానీ కాంగ్రెస్ పార్టీ పగ్గాలు వేరేవారికి అప్పగించడానికి సోనియా, రాహుల్, ప్రియాంకా ఇష్టపడటం లేదు. రాహుల్ గాంధీ సిద్దపడినా ఈవిధంగా అందరిచేత వద్దనిపించుకొని పదవిలో కొనసాగుతున్నారు. 

పార్టీ ఓటమికి సమిష్టిగా బాధ్యత తీసుకొని పార్టీని సమూలంగా ప్రక్షాళన చేయకుండా పరస్పర ఆరోపణలు చేసుకొని ఇదే ఆత్మవిమర్శ అని సరిపెట్టుకొంటుండటం వలననే కాంగ్రెస్ పార్టీ క్రమంగా బలహీనపడుతోంది...ఒక్కో రాష్ట్రంలో తుడిచిపెట్టుకుపోతోందని కాంగ్రెస్‌ అధిష్టానం గ్రహిస్తే మంచిది లేకుంటే మునిగిపోయే నావలో ప్రయాణిస్తున్నట్లే!


Related Post