తెరాసపై ప్రజలలో అసంతృప్తి పెరిగిందా?

May 24, 2019


img

లోక్‌సభ ఎన్నికలలో తెరాస 16 సీట్లు గెలుచుకొంటుందని భావించగా 9 మాత్రమే గెలుచుకోవడంతో తెరాస సర్కార్ పట్ల  ప్రజలలో పెరుగుతున్న అసంతృప్తికి నిదర్శనమనే వాదనలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా సిఎం కేసీఆర్‌ కుమార్తె కవిత, కేసీఆర్‌కు కుడిభుజం వంటి వినోద్ కుమార్‌ల ఓటమి తెరాసకు పెద్ద షాక్ అనే చెప్పవచ్చు. చేవెళ్ళలో కాంగ్రెస్‌ అభ్యర్ధి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి తృటిలో విజయం చేజారిపోయింది. ఆయన కూడా గెలిచి ఉండి ఉంటే తెరాసకు 8 సీట్లు మాత్రమే వచ్చి ఉండేవి. అప్పుడు 16కు బదులు 8 సీట్లు మాత్రమే గెలుచుకొన్నందుకు మరింత పంచాయతీ జరిగి ఉండేది. అసెంబ్లీ ఎన్నికలలో గెలిచి విజయోత్సాహంతో దూసుకుపోతున్న తెరాసకు మొదటిసారి ఎమ్మెల్సీ ఎన్నికలలో ఎదురుదెబ్బ తగిలింది. ఆ తరువాత మళ్ళీ ఇప్పుడు లోక్‌సభ ఎన్నికలలో మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. కనుక ఇక మేల్కొని దిద్దుబాటు చర్యలు చేపట్టవచ్చు. 

ప్రజలలో అసంతృప్తికి ప్రధానంగా కొన్ని కారణాలు కనిపిస్తున్నాయి. 

1. ఎంతసేపూ ఓట్లు, సీట్లు ఆలోచననే తప్ప ప్రజా సమస్యలను పరిష్కరించకపోవడం. ఆ ప్రయత్నంలో ప్రతిపక్ష ఎమ్మెల్యేలను, నేతలను తెరాసలోకి ఫిరాయింపుజేయడంపైనే ఎక్కువగా దృష్టి పెట్టడం.  

2. అధికారంలోకి వచ్చి ఆరు నెలలు కావస్తున్నా ఉద్యోగాల నోటిఫికేషన్లు, భర్తీ ప్రక్రియలు చేపట్టకపోవడం. నిరుద్యోగభృతి, పంటరుణాల మాఫీ, డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళ హామీల ఊసెత్తకపోవడం. 

3. రాష్ట్రంలో సమస్యలు పేరుకొని ఉండగా వాటిని పరిష్కరించకుండా సిఎం కేసీఆర్‌ ప్రత్యేక విమానం వేసుకొని కుటుంబ సమేతంగా ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటు పేరిట ఇతర రాష్ట్రాలలో పుణ్యక్షేత్రాలు పర్యటనలు చేస్తుండటం.  

4. రైతుల సమస్యలను ఆ కారణంగా వారిలో పెరుగుతున్న అసంతృప్తిని పట్టించుకోకపోవడం.

5. కేవలం 16 సీట్లతో కేంద్రంలో చక్రం తిప్పడం సాధ్యం కాదని తెలిసినప్పటికీ ‘కారు.. సారు...పదహారు’ నినాదంతో 16 సీట్లు గెలుచుకోవాలనే తెరాస ఆలోచనను ప్రజలు పసిగట్టడం.     

6. ఎన్నికలలో అభ్యర్ధుల పనితీరు, చిత్తశుద్ది, శక్తిసామర్ధ్యాలకు బదులు కేసీఆర్‌ మొహం చూసి ఓటేయాలనే పిలుపు.

ఏపీ అసెంబ్లీ, తెలంగాణ లోక్‌సభ ఎన్నికల ఫలితాలతో తేలిందేమిటంటే పాలకులకు నోరు కంటే ప్రజల సమస్యలు వినేందుకు చెవులు ఉండాలని. 


Related Post