ఆమెను ప్రధానిని చేసేందుకు కాంగ్రెస్‌ సై?

May 09, 2019


img

గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈసారి ప్రధానిపదవి చుట్టూ దేశ రాజకీయాలు జోరుగా సాగుతున్నాయి. బిజెపి గెలిస్తే మోడీ, కాంగ్రెస్‌ గెలిస్తే రాహుల్ ప్రధాని అవుతారని అందరికీ తెలుసు కానీ ఈసారి ఆ రెండు పార్టీలకు సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఉండదని దేశంలో ప్రాంతీయ పార్టీలన్నీ బలంగా నమ్ముతున్నాయి. కనుక కేసీఆర్‌, చంద్రబాబునాయుడు ఇద్దరూ ప్రాంతీయ పార్టీల మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. 

కాంగ్రెస్‌, బిజెపిలకు ప్రత్యామ్నాయంగా ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటు చేస్తున్నట్లు కేసీఆర్‌ చెపుతున్నప్పటికీ ప్రధాని అభ్యర్ధి ఎవరో తేలేవరకు దానిలో ఎంతమంది ఉంటారో చెప్పడం కష్టం. కేసీఆర్‌ చెపుతున్న గుణాత్మకమైన మార్పు ఊహాజనితంగా, ఫెడరల్‌ ఫ్రంట్‌ వాస్తవిక రాజకీయ పరిస్థితులకు, వాటి ఆలోచనలకు దూరంగా కనబడుతోంది. ఫెడరల్‌ ఫ్రంట్‌లో కేసీఆర్‌తో సహా మాయావతి, మమతా బెనర్జీ ముగ్గురికి ఆ పదవిపై ఆశ ఉంది. కనుక వారి అభ్యర్ధిత్వాన్ని ఎన్ని పార్టీలు బలపరుస్తాయో చూడాలి. 

దేశంలో చాలా ప్రాంతీయ పార్టీలు బిజెపిని వ్యతిరేకిస్తున్నంతగా కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించడం లేదనే సంగతి అందరికీ తెలుసు. కనుక సులువుగా అధికారం దక్కించుకోవడం కోసం అవి కాంగ్రెస్ పార్టీతోనే చేతులు కలుపవచ్చు. ఏపీ సిఎం చంద్రబాబునాయుడు నిన్న పశ్చిమబెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్‌ తరపున ఎన్నికల ప్రచారానికి వెళ్లినప్పుడు, మాయావతిని ప్రధాని అభ్యర్ధిగా చేసేందుకు మమతా బెనర్జీని ఒప్పించే ప్రయత్నం చేసినట్లు తాజా సమాచారం. అప్పుడే యూపీలోని ఎస్పీ, బీఎస్పీ పార్టీలతో సహా దేశంలో ప్రాంతీయ పార్టీలన్నీ ఒక్క త్రాటిపైకి రాగలవని, మోడీని అడ్డుకొనేందుకు ఇంతకు మించి వేరే మార్గం లేదని ఆమెకు నచ్చజెప్పినట్లు తెలుస్తోంది. మరో 5 ఏళ్ళ పాటు ప్రతిపక్ష బెంచీలలో కూర్చోవడం కంటే ఏదో విధంగా అధికారం చేజిక్కించుకోవాలని భావిస్తున్న రాహుల్ గాంధీ కూడా ఇందుకు సిద్దంగానే ఉన్నట్లు గతంలోనే చెప్పారు. కనుక ఆయన ప్రధానమంత్రి రేసులో నుంచి తప్పుకోవచ్చు. అదే జరిగితే కాంగ్రెస్‌ నేతృత్వంలో ప్రాంతీయ పార్టీలు ఏకం అయ్యే అవకాశాలు కూడా పెరుగుతాయి. 

కనుక ఒకవేళ ఈసారి బిజెపి గెలవలేకపోతే, కాంగ్రెస్‌ మిత్రపక్షాలు అధికారం దక్కించుకొనే అవకాశాలే ఎక్కువ కనిపిస్తున్నాయి. అప్పుడు కేసీఆర్‌ కూడా కాంగ్రెస్‌ మిత్రపక్షాలలో చేరిపోవచ్చునని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డి జోస్యం చెప్పారు.


Related Post