అందుకే కేసీఆర్‌ కుమారస్వామిని కలువబోతున్నారట!

May 09, 2019


img

మీడియాకు, రాజకీయపార్టీలకు మద్య సన్నటిగీత చెరిగిపోయిన తరువాత ఇప్పుడు మీడియా ఏదో ఒక రాజకీయ పార్టీకి అనుకూలంగానో లేదా వ్యతిరేకంగానో వార్తలు వండి వడ్డిస్తుండటం అందరూ చూస్తూనే ఉన్నారు. ఈరోజు ఒక ప్రముఖ తెలుగు దినపత్రికలో ‘సిఎం కేసీఆర్‌ కాంగ్రెస్ పార్టీకి చేరువయ్యేందుకు ప్రయత్నిస్తున్నారంటూ’ ఒక ఆసక్తికరమైన కధనం ప్రచురించింది. 

ఈసారి కేంద్రంలో మళ్ళీ మోడీ సర్కార్ వచ్చే అవకాశం లేదని గ్రహించిన కేసీఆర్‌, కాంగ్రెస్ పార్టీకి చేరువయ్యేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారని ఆ పత్రిక వ్రాసింది. ఆ ప్రయత్నాలలో భాగంగానే కాంగ్రెస్‌ మిత్రపక్షాలైన డిఎంకె అధినేత స్టాలిన్, జెడిఎస్ అధినేత కుమారస్వామిని కలవబోతున్నట్లు ఆ కధనంలో పేర్కొంది. కర్ణాటకలో కాంగ్రెస్‌-జెడిఎస్ సంకీర్ణ ప్రభుత్వం నడుస్తున్న కారణంగా జాతీయస్థాయిలో కూడా వాటి పొత్తు కొనసాగుతుందని వేరే చెప్పనవసరం లేదు. ఆ కారణంగా దేవగౌడ, కుమారస్వామి ఇద్దరికీ రాహుల్ గాంధీతో సన్నిహిత పరిచయాలు ఉన్నందున వారి ద్వారా రాహుల్ గాంధీకి చేరువయ్యేందుకు సిఎం కేసీఆర్‌ ప్రయత్నిస్తున్నారని ఆ పత్రిక వ్రాసింది. కేరళ సిఎం పినరయి విజయన్‌తో భేటీ కూడా అందుకేనని పేర్కొంది. 

ఈ కధనంలో నిజానిజాలు ఉన్నాయా లేక ‘లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత కేసీఆర్‌, చంద్రబాబునాయుడు, జగన్‌మోహన్‌రెడ్డి ముగ్గురూ యూపీయేలో చేరుతారని’ సంగారెడ్డి కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డి చెప్పిన మాటలు పట్టుకొని ఆ పత్రిక ఈ కధ అల్లిందా?లేక జగ్గారెడ్డి, సదరు పత్రిక చెప్పినట్లుగానే కేసీఆర్‌ కాంగ్రెస్ పార్టీకి దగ్గరయ్యే ప్రయత్నాలలోనే కాంగ్రెస్‌ మిత్రపక్షాల నేతలతో భేటీ అవుతున్నారా?అనే ప్రశ్నలకు తెరాసయే సమాధానం చెప్పాల్సి ఉంటుంది. 

అయితే కాంగ్రెస్ పాలన కారణంగానే దేశం, తెలంగాణ అభివృద్ధికి నోచుకోలేదని కనుక కాంగ్రెస్ పార్టీని దేశం, రాష్ట్రం నుంచి తరిమికొట్టాలని గట్టిగా వాదిస్తుండటమే కాకుండా కాంగ్రెస్‌ నేతలను తెరాసలోకి ఫిరాయింపజేస్తూ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని తుడిచిపెట్టేస్తున్న కేసీఆర్‌ జాతీయస్థాయిలో కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలుకుతారంటే నమ్మకం కలుగడం లేదు. కానీ కాంగ్రెస్‌తో చేతులు కలిపితే కేసీఆర్‌ కూడా తన విశ్వసనీయతను కోల్పోవడం ఖాయం.


Related Post