కేసీఆర్‌ ఫెడరల్‌ యాత్రలు మళ్ళీ షురూ

May 06, 2019


img

లోక్‌సభ ఎన్నికలు ఫలితాలు వెలువడేలోగా ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటుకు సిఎం కేసీఆర్‌ మళ్ళీ సన్నాహాలు మొదలుపెట్టారు. ఇవాళ్ళ మధ్యాహ్నం సిఎం కేసీఆర్‌ బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో కేరళ బయలుదేరి వెళ్లారు. ఈరోజు సాయంత్రం 6 గంటలకు త్రివేండ్రంలో కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌తో భేటీ అయ్యి లోక్‌సభ ఎన్నికల ఫలితాలు, తదనంతర పరిణామాలు, ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటు గురించి చర్చిస్తారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి తమిళనాడులోని రామేశ్వరం, శ్రీరంగం ఆలయాలను దర్శించుకొంటారని సమాచారం. ఆ తరువాత తమిళనాడులోని డిఎంకె పార్టీ అధినేత స్టాలిన్‌ను కలుస్తారని సమాచారం. ఇదేపని మీద త్వరలోనే మళ్ళీ కర్ణాటక వెళ్ళి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కుమారస్వామిని కూడా కలువబోతున్నట్లు సమాచారం.  

కేరళలో అధికారంలో ఉన్న వామపక్షకూటమి మొదటి నుంచి కాంగ్రెస్‌, బిజెపిలకు వ్యతిరేకంగానే ఉంటోంది. కనుక కేరళ సిఎం పినరయి విజయన్ కేసీఆర్‌ ప్రతిపాదనకు మద్దతు పలుకవచ్చు. కానీ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో సిపిఐ పార్టీ కాంగ్రెస్‌ నేతృత్వంలో ఏర్పాటైన ప్రజాకూటమిలో చేరి తెరాసపై పోరాడిన సంగతి తెలిసిందే. కనుక తెరాస పట్ల సిపిఐ వ్యతిరేకత కేవలం తెలంగాణ వరకే పరిమితం చేసుకొని జాతీయస్థాయిలో కలిసి పనిచేస్తుందా అనే విషయం తేలాల్సి ఉంది. 

ప్రస్తుతం జరుగుతున్న లోక్‌సభ ఎన్నికలలో డిఎంకె, కాంగ్రెస్‌ పార్టీలు పొత్తులు పెట్టుకొన్నాయి. రాహుల్ గాంధీ నాయకత్వాన్ని సమర్ధిస్తున్నట్లు స్టాలిన్ స్పష్టంగా ప్రకటించారు. కనుక ఫెడరల్‌ ఫ్రంట్‌లో డిఎంకె పార్టీ చేరే అవకాశం లేదనే చెప్పవచ్చు. ఈ సంగతి తెలిసి కూడా సిఎం కేసీఆర్‌ చెన్నై వెళ్ళి స్టాలిన్‌తో భేటీ అయితే ఆశ్చర్యకరమైన విషయమే. 

కర్ణాటకలో జెడిఎస్-కాంగ్రెస్‌ పార్టీలు కలిసి సంకీర్ణ ప్రభుత్వం నడిపిస్తున్న సంగతి తెలిసిందే. కనుక జెడిఎస్ కూడా కాంగ్రెస్‌ పార్టీకే మద్దతు ప్రకటించింది. ‘రాహుల్ గాంధీ ప్రధానిగా చూడాలన్నదే తన అభిలాష’ అని హెడి దేవగౌడ అన్నారు. కనుక సిఎం కేసీఆర్‌ బెంగళూరు వెళ్ళి వారిని కలిస్తే అది కూడా ఆశ్చర్యకరమైన విషయమే. 


Related Post