అందుకే కేసీఆర్‌ ముందస్తు ఎన్నికలకు వెళ్ళారా?

May 04, 2019


img

ఏపీలో చంద్రబాబునాయుడి ప్రభుత్వం దయనీయ పరిస్థితిని చూస్తున్నప్పుడు, ఎన్నికలకు...ఫలితాల వెల్లడికి మద్య సుమారు 40 రోజులు వ్యవధి ఉండబోతోందనే సంగతి కేసీఆర్‌కు ముందే తెలిసిందా?అందుకే ముందస్తు ఎన్నికలకు వెళ్ళారా? లేక పట్టుబట్టి తనకు అనుకూలమైన సమయంలో ముందస్తు ఎన్నికలు జరిపించుకొన్నారా? అనే సందేహం కలుగకమానదు. 

అలాగే ఏపీ శాసనసభకు జూన్ వరకు గడువు ఉన్నప్పటికీ చంద్రబాబునాయుడుపై కక్ష సాధించడానికే కేంద్రప్రభుత్వం మొదటిదశలోనే ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరిపించిందా?అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఏది ఏమైనప్పటికీ, సిఎం కేసీఆర్‌ ముందస్తు ఎన్నికలు జరిపించుకోవడం వలన ఇప్పుడు చంద్రబాబునాయుడులాగ రోజూ మానసిక క్షోభ, ఫలితాల గురించి ఆదుర్దా, ఆందోళన అనుభవించకుండా తప్పించుకోగలిగారని చెప్పవచ్చు. 

అసెంబ్లీ ఎన్నికలలో తెరాస ఘన విజయం సాధించినందున లోక్‌సభ ఎన్నికలలో కూడా మంచి ఫలితాలే పొందవచ్చు . ఒకవేళ తక్కువ ఎంపీ సీట్లు గెలుచుకొన్నా తెరాసకు వచ్చే నష్టం ఏమీ ఉండదు. కేసీఆర్‌ యధాప్రకారం నిశ్చింతగా రాష్ట్రాన్ని పరిపాలించుకోవచ్చు. 

ఒకవేళ కేంద్రంలో మళ్ళీ నరేంద్రమోడీయే అధికారం చేపట్టే అవకాశమున్నా కేసీఆర్‌కు ఎటువంటి నష్టమూ లేదు. మోదీతో కూడా మంచి స్నేహమే ఉంది కనుక కేంద్రంతో ఎటువంటి ఇబ్బందీ లేకుండా రాష్ట్రాన్ని పాలించుకోవచ్చు. 

కానీ ఒకవేళ ఏపీలో టిడిపి, కేంద్రంలో ఎన్డీయే మళ్ళీ అధికారంలోకి వచ్చినట్లయితే చంద్రబాబునాయుడు ప్రభుత్వానికి కేంద్రం నుంచి ఇబ్బందులు తప్పవు. ఒకవేళ టిడిపి ఓడిపోతే చంద్రబాబునాయుడుకి పాత కేసుల తాలూకు ఇబ్బందులు కూడా మొదలవవచ్చు. కానీ ఒకవేళ కేంద్రంలో కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూపీయే లేదా మరెవరైనా ప్రధాని కాగలిగితే చంద్రబాబునాయుడుకి కష్టాల నుంచి విముక్తి లభిస్తుంది. 

అప్పుడు సిఎం కేసీఆర్‌ అటు యూపీయే ప్రభుత్వంతో, ఇటు రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీతో ఏవిధంగా వేగుతారో ఊహించడం కష్టమే. ఎందుకంటే, తెలంగాణ ఏర్పాటు తరువాత జాతీయ కాంగ్రెస్ పార్టీకి హ్యాండిచ్చి, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని తుడిచిపెట్టి వేస్తున్నందుకు యూపీయే ప్రభుత్వం కేసీఆర్‌పై ప్రతీకారం తీర్చుకోకుండా విడిచిపెట్టదు. కానీ తెలంగాణలో తిరుగులేని అధికారం చలాయిస్తున్న కారణంగా కేసీఆర్‌ ఎటువంటి ఇబ్బందికర పరిస్థితులు ఎదురైనా ధైర్యంగా తట్టుకొని నిలబగడలరని చెప్పవచ్చు. 


Related Post