పాపం చంద్రబాబునాయుడు!

May 04, 2019


img

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పరిస్థితిని చూసి బాధపడాలో జాలిపడాలో లేక ఆయనకు ఇటువంటి పరిస్థితి కల్పించినవారిపై ఆగ్రహించాలో తెలియడం లేదు. ఏప్రిల్ 11న అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. కానీ మే 23న ఫలితాలు వెల్లడయ్యేవరకు రాష్ట్రంలో ఎన్నికల ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున రాష్ట్ర ఎన్నికల సంఘం ఆయనకు పరిమితులు విధించి, సర్వాధికారాలు ప్రభుత్వ ప్రధానకార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యంకు కట్టుబెట్టడంతో చంద్రబాబునాయుడుకి చేతులు కాళ్ళు బందించి కుర్చీలో కూర్చోబెట్టినట్లయింది. 

తన ఆదేశానుసారం పనిచేయవలసిన ప్రభుత్వ ప్రధానకార్యదర్శి తానే ముఖ్యమంత్రి అన్నట్లు వ్యవహరిస్తూ తనను ఖాతరు చేయకపోవడాన్ని చంద్రబాబు భరించలేకపోతున్నారు. అధికారాలు లేని చంద్రబాబునాయుడు పరిస్థితి కోరలు పీకిన పాములా ఉందిప్పుడు. దినమొక యుగంలాగ, రోజుకో అవమానం భరిస్తూ భారంగా రోజులు గడుపుతున్నారు. లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడటానికి ఇంకా 21 రోజుల సమయం ఉంది. చేతిలో అధికారాలు, పని ఏవీ లేకపోవడంతో ఇక చేసేదేమీ లేక లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేసిన టిడిపి అభ్యర్ధులతో నియోజకవర్గాలవారీగా పోలింగ్‌ సరళిపై సమీక్షా సమావేశాలు నిర్వహించుకొంటూ కాలక్షేపం చేస్తున్నారు.

పొరుగు రాష్ట్రమైన తెలంగాణలో కూడా ఎన్నికల కోడ్ అమలులో ఉన్నప్పటికీ సిఎం కేసీఆర్‌ యధావిధిగా ప్రభుత్వ పరిపాలన సాగిస్తూ అధికారులతో సమావేశాలు నిర్వహించుకొంటుండగా ఏపీలో మాత్రం ఎన్నికల కోడ్ అమలు పేరుతో తమకు ఈవిధంగా ఇబ్బందులు సృష్టించడాన్ని తప్పుపడుతూ చంద్రబాబు కేంద్ర ఎన్నికల కమీషనర్ కు లేఖ వ్రాసినప్పటికీ స్పందన కరువైంది. ప్రధాని మోడీతో శతృత్వం కారణంగా ఈవిషయంలో కేంద్రం సహకారం కోరలేని పరిస్థితి ఏర్పడింది. చంద్రబాబుకి ఇప్పుడు ఎటు చూసినా శత్రువులే తప్ప ఒక్క మిత్రుడు కూడా కనబడటం లేదు.

సుమారు నాలుగున్నరేళ్ళు తిరుగులేకుండా రాష్ట్రాన్ని ఏలిన చంద్రబాబునాయుడుకి ఇటువంటి పరిస్థితి వస్తుందని బహుశః ఎవరూ ఊహించి ఉండరేమో? బహుశః ఆయన కూడా ఊహించి ఉండరేమో? ఆయన పరిస్థితి చూస్తే అయ్యో పాపం...అనిపించకమానదు. ఒకవేళ అసెంబ్లీ ఎన్నికలలో గెలిచి మళ్ళీ అధికారంలోకి వస్తే పరువాలేదు లేకుంటే చంద్రబాబునాయుడు మున్ముందు మరింత అవమానకరమైన పరిస్థితులను ఎదుర్కొనే ప్రమాదం కనబడుతోంది.


Related Post