మే నెలాఖరులోగా మంత్రివర్గ విస్తరణ?

May 04, 2019


img

లోక్‌సభ ఎన్నికల తరువాత తెలంగాణ మంత్రివర్గ విస్తరణ ఉంటుందని సిఎం కేసీఆర్‌ ఎప్పుడో చెప్పారు. మే 23న లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. జూన్ 2న రాష్ట్ర అవతరణ దినోత్సవం ఉంది. కనుక మే 23 నుంచి జూన్ 2లోగా ఎప్పుడైనా రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశం ఉంది.    

తెరాస వరుసగా రెండవసారి అసెంబ్లీ ఎన్నికలలో గెలిచి అధికారంలోకి వచ్చిన తరువాత మొదట సిఎం కేసీఆర్‌, మహమూద్ అలీ మాత్రమే బాధ్యతలు చేపట్టారు. ఆ తరువాత మళ్ళీ ఈ ఏడాది ఫిబ్రవరి 18న జరిగిన మంత్రివర్గ విస్తరణలో మరో 10 మంది మంత్రులయ్యారు. అయితే తెరాస మొదటి, రెండవ ప్రభుత్వాలలో మంత్రివర్గంలో మహిళలకు స్థానం కల్పించకపోవడంపై తీవ్ర విమర్శలు ఎదురవడంతో, తదుపరి మంత్రివర్గం విస్తరణలో ఇద్దరు మహిళలకు మంత్రివర్గంలో తీసుకొంటానని సిఎం కేసీఆర్‌ అసెంబ్లీలో ప్రకటించారు. 

మహిళా మంత్రులలో మాజీ డెప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి (మెదక్‌), ఇటీవల కాంగ్రెస్‌ నుంచి తెరాసలో చేరుతున్నట్లు ప్రకటించిన సబితా ఇంద్రారెడ్డి (మహేశ్వరం)కి అవకాశం ఉంటుందని సమాచారం. కాంగ్రెస్‌ శాసనసభాపక్షం తెరాసలో విలీనం జరిగితే ఆమెకు అవకాశం లభించవచ్చు లేదా తెరాస ఎమ్మెల్యేలు గొంగిడి సునీత (ఆలేర్), రేఖా నాయక్ (ఖానాపూర్), ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్‌లలో ఎవరో ఒకరికి అవకాశం లభించవచ్చు. 

రాజ్యాంగ నిబందనల ప్రకారం సిఎం కేసీఆర్‌ కాకుండా 17మంది వరకు మంత్రివర్గంలో అవకాశం ఉంటుంది. ప్రస్తుతం మంత్రివర్గంలో సిఎం కేసీఆర్‌ కాకుండా 11 మంది మంత్రులు ఉన్నారు కనుక మరో ఆరుగురికి అవకాశం ఉంటుంది. రెండు మంత్రి పదవులు మహిళలకు పోగా మరో నలుగురికి మాత్రమే అవకాశం ఉంటుంది. 

మిగిలిన నలుగురిలో మాజీ మంత్రులు కేటీఆర్‌, హరీష్‌రావులను లేదా హరీష్‌రావు ఒక్కరినే మంత్రివర్గంలోకి తీసుకోవడం ఖాయమనే భావించవచ్చు. ఒకవేళ లోక్‌సభ ఫలితాల తరువాత కేంద్రంలో ఫెడరల్‌ ఫ్రంట్‌కు చక్రం తిప్పే అవకాశం ఉన్నట్లయితే జాతీయ రాజకీయాలలో పాల్గొనేందుకు వీలుగా కేసీఆర్‌ తన పదవికి రాజీనామా చేసి కేటీఆర్‌ను ముఖ్యమంత్రిగా చేసినా చేయవచ్చు. అటువంటి అవకాశమే ఉన్నట్లయితే హరీష్‌రావును కూడా కేసీఆర్‌ తన వెంట డిల్లీ తీసుకుపోయినా ఆశ్చర్యం లేదు.    

కుల సమీకరణాల ప్రకారం చూసినట్లయితే ప్రస్తుత మంత్రివర్గంలో రెడ్డి సామాజిక వర్గానికి చెందినవారు-5, వెలమ-1, బీసీలు-3, ఎస్సీ-1, మైనారిటీ-1 మంత్రులుగా ఉన్నారు. కనుక కనీసం ఒక మంత్రి పదవి ఎస్టీలకు కేటాయించవలసి ఉంటుంది. ప్రస్తుత మంత్రివర్గంలో ఖమ్మం జిల్లాకు ప్రాతినిధ్యం లేదు. కనుక ఆ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేకు అవకాశం కల్పించవలసి ఉంది. ఈ సమీకరణాల ప్రకారం మిగిలిన మంత్రిపదవులు భర్తీ చేసే అవకాశం ఉంది. తెరాసలో చేరిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలలో మరొకరికి కూడా ఈసారి అవకాశం లభించవచ్చునని సమాచారం. 

గతంలో ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రిగా చేసిన కడియం శ్రీహరికి ఈ తుది విస్తరణలో అవకాశం లభిస్తుందో లేదో తెలియదు. ఇంకా సీనియర్ నేతలు తుమ్మల నాగేశ్వరరావు, గంగుల కమలాకర్, బాజిరెడ్డి గోవర్ధన్, బాల్కా సుమన్, సోలిపేట రామలింగారెడ్డి, జీవన్ రెడ్డివంటివారు అనేకమంది ఉన్నారు. వారిలో ఎవరెవరికి అవకాశం లభిస్తుందో చూడాలి. లోక్‌సభ ఎన్నికల ఫలితాలను బట్టి మంత్రివర్గంలో ఎవరెవరు ఉండబోతున్నారో నిర్ణయించవచ్చు కనుక మే 23 తరువాతే దీనిపై కొంత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.


Related Post