అమిత్ షా హామీతో లక్ష్మణ్ దీక్ష విరమణ!

May 03, 2019


img

గత 5 రోజులుగా నీమ్స్ ఆసుపత్రిలో నిరవదిక నిరాహార దీక్ష చేస్తున్న తెలంగాణ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు కె.లక్ష్మణ్ శుక్రవారం మధ్యాహ్నం దీక్షను విరమించారు. బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా డిల్లీ నుంచి ఆయనకు ఫోన్ చేసి  రాష్ట్ర ఇంటర్మీడియట్‌ విద్యార్దులకు న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇవ్వడంతో ఆయనకు బండారు దత్తాత్రేయ నిమ్మరసం అందించి దీక్ష విరమింపజేశారు. అనంతరం బిజెపి సీనియర్ నేత మురళీధర్ రావు మీడియాతో మాట్లాడుతూ, “త్వరలోనే రాష్ట్రంలోని 119 నియోజకవర్గాలలో దీక్షలు చేసి రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి చేసి ఇంటర్ విద్యార్దులకు న్యాయం జరిగేలా చూస్తాము. ఇంటర్ బోర్డులో జరిగిన అవకతవకలకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకొనేవరకు పోరాటం కొనసాగిస్తాము. త్వరలోనే డిల్లీ వెళ్ళి రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ను, కేంద్ర హోంమంత్రి రాజ్ నాధ్ సింగ్ ను కలిసి ఇంటర్ విద్యార్దుల సమస్యలను వారి దృష్టికి తీసుకు వెళ్ళి, ప్రభుత్వం తీరుపై ఫిర్యాదు చేస్తాము,” అని చెప్పారు. 

రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి ఇంటర్ బోర్డులో జరిగిన అవకతవకలకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవడం, చనిపోయిన విద్యార్దుల కుటుంబాలకు నష్ట పరిహారం చెల్లించడం అనే రెండు ప్రధాన డిమాండ్లతో కె.లక్ష్మణ్ నిరవదిక నిరాహార దీక్ష ప్రారంభించారు. కానీ ఆయన నీమ్స్ ఆసుపత్రిలో 5 రోజులు నిరాహార దీక్ష చేసినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదు. అంటే ఆయన దీక్ష చేపట్టిన ఉద్దేశ్యం నెరవేరలేదని అర్ధమవుతోంది. కానీ ఇంకా దీక్ష కొనసాగిస్తే ఆయన ఆరోగ్యానికి ప్రమాదం కనుక ఈ సమస్యలను అమిత్ షా పరిష్కరించలేరని తెలిసి ఉన్నప్పటికీ ఆయన హామీతోనే దీక్షను విరమించవలసివచ్చింది. ఈ సమస్యపై రాష్ట్రపతి, హోంమంత్రికి పిర్యాదులు చేయడం వలన కూడా ఎటువంటి ప్రయోజనం ఉండబోదని అందరికీ తెలుసు. అలాగే 119 జిల్లాలో దీక్షలు బిజెపిని బలోపేతం చేసుకోవడానికే ఉపయోగపడతాయి తప్ప ఈ సమస్యను పరిష్కరించలేవని అందరికీ తెలుసు. బిజెపిలో మురళీధర్ రావు వంటి యువనేతలు అనేకమంది ఉండగా ఈ వయసులో కె.లక్ష్మణ్ ఇటువంటి సాహసం ఎందుకు చేశారో తెలియవలసి ఉంది.


Related Post