కాంగ్రెస్‌-బిజెపి సర్జికల్‌ స్ట్రయిక్స్‌ పోటీ

May 03, 2019


img

తమ హయాంలో జరిగిన సర్జికల్‌ స్ట్రయిక్స్‌ గురించి ప్రధాని నరేంద్రమోడీ, బిజెపి నేతలు లోక్‌సభ ఎన్నికల ప్రచారసభలలో గొప్పగా చెప్పుకొంటూ, దేశాన్ని కాపాడే శక్తి, ధైర్యం తమకే ఉన్నాయని చెప్పుకోవడం అందరూ చూస్తూనే ఉన్నారు. పదేళ్ళ కాంగ్రెస్‌ హయాంలో దేశంలో ఎన్ని ఉగ్రవాదదాడులు జరిగినప్పటికీ అప్పటి ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎటువంటి ప్రతిచర్యలు తీసుకోకుండా చేతులు ముడుచుకొని కూర్చొని దేశభద్రతను గాలికొదిలేశారని ప్రధాని నరేంద్రమోడీతో సహా బిజెపి నేతలు గట్టిగా వాదిస్తున్నారు. కనుక ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో అణచివేసి శత్రుదేశం భారత్‌ వైపు కన్నెత్తి చూడకుండా ఉండాలంటే మళ్ళీ బిజెపికే ఓటు వేసి గెలిపించాలని ప్రజలను కోరుతున్నారు. బిజెపి చెపుతున్న ఈ మాటలు సామాన్యప్రజలకు బాగానే చేరుతోంది కనుక ఎన్నికలలో లబ్ది పొందే అవకాశం కూడా ఉంటుందని చెప్పవచ్చు. ఇది గ్రహించిన కాంగ్రెస్ పార్టీ కూడా తమ హయాంలో జరిగిన సర్జికల్‌ స్ట్రయిక్స్‌ గురించి బయటపెట్టింది. 

తమ ప్రభుత్వం గురించి బిజెపి చేస్తున్న దుష్ప్రచారాన్ని మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ తిప్పికొడుతూ, “మా ప్రభుత్వం దేశభద్రతను గాలికొదిలేసిందనే బిజెపి వాదనలను ఖండిస్తున్నాను. మా హయాంలో కూడా పాకిస్థాన్‌ భూభాగంలో సర్జికల్‌ స్ట్రయిక్స్‌ జరిగాయి. కానీ ప్రధాని నరేంద్రమోడీ, బిజెపి నేతలలాగ వాటి గురించి చాటింపు వేసుకొని ఎన్నికలలో రాజకీయలబ్ది పొందాలని మేము ప్రయత్నించడంలేదు. ఆర్ధికరంగంలో మోడీ  ప్రభుత్వం ఘోరంగా విఫలమైనందునే తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకొనేందుకు బిజెపి నేతలు సర్జికల్‌ స్ట్రయిక్స్‌ గురించి గొప్పగా చెప్పుకొంటున్నారు,” అని అన్నారు.   

కాంగ్రెస్‌ ఎంపీ రాజీవ్ శుక్లా  గురువారం డిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, “2008-14 మద్య భారత్‌ సైన్యం ఆరుసార్లు సరిహద్దులు దాటి పాక్‌ భూభాగంలో ప్రవేశించి సర్జికల్‌ స్ట్రయిక్స్‌ నిర్వహించింది. కానీ మేమేనాడూ నరేంద్రమోడీలాగా వాటి గురించి గొప్పలు చెప్పుకోలేదు. రాజకీయ లబ్ది పొందాలని ప్రయత్నించలేదు. దేశభద్రత విషయంలో మా ప్రభుత్వం రాజీపడుతుందని బిజెపి నేతలు చేస్తున్న ఆరోపంలను త్రిప్పి కొట్టడానికే ఇప్పుడు మేము ఆ వివరాలను బయటపెట్టవలసివస్తోంది,” అని చెప్పి ఆ వివరాలను మీడియాకు అందజేశారు.

1. మొదటి సర్జికల్‌ దాడి: 2008 జనవరి 19న పూంచ్‌ సెక్టార్‌కు చెందిన బట్టాల్‌ సెక్టార్‌లో జరిగింది.

2. రెండో సర్జికల్‌ దాడి: 2011 ఆగస్టు 30-సెప్టెంబరు 1న పీవోకేలోని కేల్‌ ప్రాంతంలోని నీలుమ్‌ నదీ లోయలో జరిగింది.

3. మూడో సర్జికల్‌ దాడి: 2013 జనవరి 6న సవన్‌ పాత్ర చెక్‌పోస్టు వద్ద జరిగింది. 

4. నాలుగో సర్జికల్‌ దాడి: 2013 జూలై 27-28 నాజాపూర్‌ సెక్టార్‌లో జరిగింది.

5. ఐదో సర్జికల్‌ దాడి: 2013 ఆగస్టు 6న నీలుమ్‌ నదీ లోయలో జరిగింది. 

6. ఆరో సర్జికల్‌ దాడి: 2014 జనవరి 14న నీలుమ్‌ నదీ లోయలో జరిగింది.


Related Post