కాంగ్రెస్‌ వెంటే తృణమూల్ కాంగ్రెస్!

May 02, 2019


img

లోక్‌సభ ఎన్నికల తరువాత కేంద్ర ప్రభుత్వం ఏర్పాటులో ఫెడరల్‌ ఫ్రంట్‌ కీలకపాత్ర పోషించబోతోందని సిఎం కేసీఆర్‌తో సహా తెరాస నేతలు పదేపదే చెప్పారు. దానిలో పశ్చిమబెంగాల్‌కు చెందిన అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కూడా భాగస్వామిగా ఉంటుందని పదేపదే చెప్పారు. 

కానీ ఆ పార్టీ సీనియర్ నేత డెరెక్‌ ఒబ్రెయిన్‌ గురువారం కోల్‌కతాలో మీడియాతో మాట్లాడుతూ, “మరొక 21 రోజులలో ప్రధాని నరేంద్రమోడీ గద్దె దిగిపోక తప్పదు. లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే ప్రాంతీయ పార్టీల ముఖ్య నేతలు అందరం సమావేశమయ్యి కేవలం ఒక గంట వ్యవధిలో మా ప్రధాని అభ్యర్ధిని ఎన్నుకొంటాము. అంతకంటే ముందు అన్ని పార్టీలు కలిసి సంకీర్ణ ప్రభుత్వం సజావుగా నడిపేందుకు ‘యునైటెడ్ ఇండియా మినిమమ్ అజెండా’ పేరుతో విధివిధానాలు రూపొందించుకొంటాము. దాని ప్రకారమే అందరూ నడుచుకొంటూ కేంద్రంలో సుస్థిరమైన, పారదర్శకమైన ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయబోతున్నాము. కేంద్రప్రభుత్వం ఏర్పాటులో తృణమూల్ కాంగ్రెస్ కీలకపాత్ర పోషిస్తుంది. మా కూటమిలో కాంగ్రెస్ పార్టీ కూడా భాగస్వామిగా ఉంటుంది,” అని అన్నారు. 

అంటే కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో ఏర్పాటవుతున్న కూటమిలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ చేరబోతోందని స్పష్టం అయ్యింది. ఒకవేళ కాంగ్రెస్‌ పార్టీ కూడా మమతా బెనర్జీని ప్రధానమంత్రి అభ్యర్ధిగా అంగీకరించినప్పటికీ, కాంగ్రెస్‌ నేతృత్వం వహిస్తున్న ఆ కూటమిలో సిఎం కేసీఆర్‌ భాగస్వామిగా చేరబోరని చెప్పవచ్చు. కనుక కాంగ్రెస్‌ నేతలు ఊహిస్తున్నట్లుగా అవసరమైతే నరేంద్రమోడీ మళ్ళీ ప్రధాని అయ్యేందుకు సిఎం కేసీఆర్‌ మద్దతు ఇస్తారేమో?మరొక మూడు వారాలలో ఎవరు ఏ గట్టున ఉంటారో తేలిపోతుంది కనుక అంతవరకు వేచి చూడకతప్పదు. 



Related Post