అందుకే తెరాస టోన్ మారింది: బాబు

May 02, 2019


img

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. గురువారం అమరావతి నుంచి రాష్ట్రంలోని టిడిపి నేతలు, కార్యకర్తలతో టెలీ కాన్ఫరెన్సింగ్ లో మాట్లాడుతూ, ఈసారి కూడా మళ్ళీ ఏపీలో తెలుగుదేశం పార్టీయే ఎన్నికలలో గెలిచి అధికారంలోకి రాబోతోందని అన్నారు. తన వద్ద బూత్‌ల వారీగా జరిపించిన ఎగ్జిట్ సర్వే నివేదికలున్నాయని వాటిలో టిడిపియే గెలువబోతోందని తేలిందని అన్నారు. 

ఓటమి భయంతోనే వైసీపీ మైండ్ గేమ్స్ ఆడుతోందని, టిడిపి అభ్యర్ధులుగా పోటీ చేసినవారు దాని మాయలోపడి ఓడిపోతామని భయపడవద్దని, అందరూ తమ గెలుపోటముల గురించి కాక ఎంత మెజార్టీతో గెలుస్తామని లెక్కలు కట్టుకోవచ్చునని చంద్రబాబు భరోసా ఇచ్చారు. ఏపీలో టిడిపి మళ్ళీ గెలువబోతోందని తెరాస కూడా గ్రహించిందని అందుకే దాని ‘టోన్’ మారిందని చంద్రబాబు అన్నారు. 

తమ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పధకాలపట్ల రాష్ట్ర ప్రజలు సంతృప్తిగా ఉన్నారని వారి సంతృప్తి, ఆశీర్వాదంతోనే మళ్ళీ అధికారంలోకి రాబోతున్నామని చంద్రబాబునాయుడు చెప్పారు. అయితే కౌంటింగ్ జరిగే వరకు వైసీపీ మైండ్ గేమ్స్ తిప్పికొట్టాలని కోరారు. మే 23న కౌంటింగ్ జరిగే రోజున టిడిపి నేతలు, కార్యకర్తలు అందరూ పూర్తి అప్రమత్తంగా ఉండాలని చంద్రబాబునాయుడు హెచ్చరించారు. ఈసారి లోక్‌సభ ఎన్నికలలో బిజెపి ఓటమి, నరేంద్రమోడీ గద్దె దిగడం ఖాయమని చంద్రబాబునాయుడు అన్నారు. 

ఈసారి ఏపీలో ఎన్నికలకు ముందు ఎవరి నోట విన్నా ‘వైసీపీ గెలుస్తుందిట కదా? ఈసారి జగన్‌మోహన్‌రెడ్డికే ఓటు వేయాలనుకొంటున్నమనే’ మాటలు చాలా మందినోట వినబడింది. పోలింగ్ దగ్గర పడుతున్న కొద్దీ ఈ మౌత్ టాక్ చాలా బలంగా వినిపించింది. కానీ పోలింగ్ తరువాత ఎవరూ కూడా అంతే నమ్మకంగా ఆ మాటలు చెప్పకపోవడం విశేషం. “ఈసారి మళ్ళీ చంద్రబాబునాయుడు వస్తారా లేక జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అవుతారా?” అనే ప్రశ్నకు ఏపీలో ఎవరూ ఖచ్చితంగా జవాబు చెప్పలేకపోవడం గమనిస్తే రెండు పార్టీల మద్య గట్టి పోటీ జరిగిందని స్పష్టం అవుతోంది. కనుక చంద్రబాబునాయుడు చెపుతున్నట్లుగా భారీ మెజార్టీతో కాక రెండు పార్టీలలో ఏదో ఒక పార్టీ బొటాబోటి సీట్లతో ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. కానీ రెంటిలో ఏది అధికారంలోకి వచ్చినా ఓడిపోయిన పార్టీ ఎమ్మెల్యేలను ఫిరాయింపజేసుకొని ప్రభుత్వాన్ని బలోపేతం చేసుకోవడం ఖాయం.


Related Post