భారత్‌ శ్రమ ఫలించింది కానీ...

May 02, 2019


img

భారత్‌లో పలు ఉగ్రదాడులకు సూత్రధారి అయిన జైష్‌ ఎ మహ్మద్‌ అధిపతి మసూద్‌ అజార్‌ను ఐక్యరాజ్యసమితి బుదవారం అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించింది. భారత్‌, అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ తదితర దేశాల ఒత్తిడికి తలొగ్గి ఇంతకాలం అతనిపై ఈ ముద్రపడకుండా కాపాడుతున్న చైనా వెనక్కుతగ్గడంతో ఇది సాధ్యమైంది. దీంతో గత 10 ఏళ్లుగా దీనికోసం అంతర్జాతీయ వేదికలపై భారత్‌ చేస్తున్న పోరాటం ఫలించినట్లయింది. 

మసూద్‌ అజార్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించడంతో దేశవిదేశాలలో అతడి సంస్థల ఆస్తులు, బ్యాంక్ ఖాతాలు  స్తంభింపజేయబడతాయి. కనుక ఆయుధాలు కొనుగోలు చేయడానికి వీలుపడదు. అతను ఇతర దేశాలకు స్వేచ్ఛగా తిరగలేడు. అతనితో, అతని సంస్థతో సంబందం ఉన్నవారిపై కూడా ఈ ఆంక్షలు వర్తింపజేయబడతాయి. 

ఐక్యరాజ్యసమితి చేత మసూద్‌ అజార్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటింపజేయడం భారత్‌కు చాలా గొప్ప విజయమే కానీ అది పూర్తి విజయమని చెప్పడానికి కూడా లేదు. ఎందుకంటే, భారత్‌పై దాడులు జరిపేందుకు పాక్‌ సైన్యాధికారులు, పాక్‌ ఐఎస్ఐ సంస్థలు జైష్‌ ఎ మహ్మద్‌ ఉగ్రవాద సంస్థకు కావలసిన ఆయుధాలు, శిక్షణ, ఆర్ధికసహాయం అన్నీ అందిస్తున్నపుడు అతనిపై ప్రపంచదేశాలు ఎన్ని ఆంక్షలు విధించినా పెద్ద తేడా ఏమీ ఉండదనే చెప్పవచ్చు. మసూద్‌ అజార్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించగానే పాకిస్తాన్ అతనిని వెంటనే ఇస్లామాబాద్‌లో ఒక రహస్యస్థావరానికి తరలించినట్లు తెలుస్తోంది. పాక్‌ పాలకులకు అతనిపై ఉన్న ప్రత్యేకాభిమానానికి ఇదే నిదర్శనంగా చెప్పుకోవచ్చు. కనుక అతనిని భారత్‌కు అప్పగించినప్పుడు లేదా భారత్‌ అతనిని అంతమొందించినప్పుడే పూర్తి విజయం సాధించినట్లవుతుంది. 


Related Post