చిన్న పరిశ్రమలు కేరాఫ్ దండు మల్కాపూర్

May 01, 2019


img

రాష్ట్రంలో అనేక సూక్ష్మ, చిన్న, మద్య స్థాయి పరిశ్రమలున్నాయి. వాటిద్వారా వేలాదిమంది ఉపాది పొందుతున్నారు. కానీ వాటిలో అనేక పరిశ్రమలు అద్దె భవనాలు లేదా షెడ్లలోనే నడుస్తుండటం వలన అవకాశాలున్నప్పటికీ ఎదగలేకపోతున్నాయి. అటువంటి పరిశ్రమల కోసం ప్రత్యేకంగా ఒక పార్క్ ఏర్పాటు చేయాలనే తెలంగాణ పారిశ్రామికవేత్తల సమాఖ్య (టిఎఫ్) ప్రతిపాదనను గతంలో పరిశ్రమల శాఖామంత్రిగా చేసిన కేటీఆర్‌ ఆమోదించడంతో ఈ పార్కు కోసం యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ మండలం దండు మల్కాపూర్‌ వద్ద ఎకరం రూ.17 లక్షల చొప్పున 377 ఎకరాలు టిఎఫ్ కు ప్రభుత్వం కేటాయించింది. ఇదంతా జరిగి సుమారు ఏడాదిన్నర కావస్తోంది. అప్పటి నుంచి టిఎఫ్ అధ్వర్యంలో పార్క్ నిర్మాణం కోసం శరవేగంగా పనులు జరుగుతున్నాయి. 

పార్కులో అంతర్గత రోడ్లు, డ్రైనేజీ, మిషన్ భగీరధ ద్వారా త్రాగునీరు, విద్యుత్ సరఫరా కోసం 132 కేవీ సబ్‌స్టేషన్‌,  పరిశ్రమల ఏర్పాటుకు ప్రీ ఫాబ్రికేటడ్ షెడ్ల నిర్మాణం, పార్క్ సమీపంలోనే చిన్న టౌన్ షిప్, దానిలో మళ్ళీ హోటల్స్, ఆసుపత్రి, పోలీస్ స్టేషన్, కిరాణా, కూరగాయలు వంటి నిత్యావసరవస్తువులను అమ్మే దుఖాణాలు వంటివన్నీ ఏర్పాటవుతున్నాయి. 

పార్కులో ఏర్పాటు కాబోతున్న పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యం కలిగిన కార్మికులను తయారుచేయడానికి ఐ‌టిఐ‌ కూడా ఏర్పాటు చేయబోతున్నారు. పార్కులో తయారైన ఉత్పత్తులను మార్కెటింగ్ చేసుకొనేందుకు కూడా పార్కులోనే అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. అక్కడ వారానికి ఒకసారి కొనుగోలు, అమ్మకందార్ల సమావేశం నిర్వహిస్తామని తెలంగాణ పారిశ్రామికవేత్తల సమాఖ్య తెలిపింది. 

ఈ పార్కులో పరిశ్రమలు స్థాపించడానికి రాష్ట్రంలో అన్ని జిల్లాల నుంచి 1200 మంది ఔత్సాహికులు ముందుకు రాగా వారిలో 400 మంది అర్హులకు భూకేటాయింపులు జరిగాయి. ఈ పార్కులో రూ.2,000 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు కాబోతున్న పరిశ్రమలన్నీ పూర్తిస్థాయిలో పనిచేయడం మొదలు పెడితే సుమారు 30,000 మందికి ప్రత్యక్షంగా, మరో 10,000 మందికి పరోక్షంగా ఉద్యోగం, ఉపాది లభిస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. 

ఈ పార్కులో ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్, వైమానిక, రక్షణ సంస్థల పరికరాలను తయారుచేసే పరిశ్రమలు రానున్నాయి. ఇంకా ఆహారశుద్ధి, గృహోపకరణల తయారీ సంస్థలు కూడా రాబోతున్నాయి. దేశంలో మొట్టమొదటిసారిగా చిన్న పరిశ్రమల కోసం ఏర్పాటుచేస్తున్న ఈ పార్క్ ప్రయోగం విజయవంతమైతే భవిష్యత్తులో ఈ పార్కును మరో 1,200 ఎకరాలకు విస్తరించాలనే ప్రతిపాదనలు కూడా ఉన్నాయి. వచ్చే నెలలో పార్క్ ప్రారంభోత్సవం చేయాలని లక్ష్యంగా పెట్టుకొని అధికారులు, సిబ్బంది రేయింబవళ్లు పనిచేస్తున్నారు.


Related Post