విద్యార్దుల జీవితాలతో ఆడుకోవద్దు: కేటీఆర్‌

May 01, 2019


img

మేడే సందర్భంగా ఇవాళ్ళ తెలంగాణ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో కేటీఆర్‌ మాట్లాడుతూ, “ఇంటర్మీడియెట్ ఫలితాలపై రాష్ట్రంలో ప్రతిపక్షాలు చిల్లర రాజకీయాలు చేస్తున్నాయి. విద్యార్దులలో అపోహలు సృష్టించి వారిని రెచ్చగొడుతూ వారి ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నాయి. విద్యార్దులు ఆత్మహత్యలు చేసుకోవడం నాకు చాలా బాధ కలిగించింది. విద్యార్దులు ఎవరూ తొందరపడి ఆత్మహత్యలు చేసుకోవద్దని విజ్ఞప్తి చేస్తున్నాను. 

గ్లోబరీనా సంస్థతో నాకు ఎటువంటి సంబందమూ లేకపోయినప్పటికీ కాంగ్రెస్‌ నేతలు నాపై బురదజల్లాలని ప్రయత్నిస్తున్నారు. గ్లోబరీనా సంస్థ కేవలం రూ.4 కోట్లకు టెండరు వేస్తే, రూ.10,000 కోట్లు లంచం ఇచ్చిందని కాంగ్రెస్‌ నేతలు ఆరోపించడం హాస్యాస్పదంగా ఉంది. అసలు ఐ‌టి, ఇంటర్మీడియెట్ బోర్డుకు ఎటువంటి సంబందమూ ఉండదని కాంగ్రెస్‌ నేతలకు తెలియదా? అన్నీ తెలిసి కాంగ్రెస్‌ నేతలు నోటికి వచ్చిన ఆరోపణలు చేస్తే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవలసివస్తుందని హెచ్చరిస్తున్నాను. ఇంటర్ బోర్డులో నెలకొన్న గందరగోళాన్ని తొలగించి, దానికి కారకులైనవారిపై ప్రభుత్వం తప్పకుండా చర్యలు తీసుకొంటుంది,” అని అన్నారు.   

3.28 లక్షల ఇంటర్ విద్యార్దుల పరీక్షా పత్రాలను మళ్ళీ రీ-కౌంటింగ్, రీ-వెరిఫికేషన్ చేయబోతున్న ఇంటర్మీడియెట్ బోర్డు, త్రిసభ్య కమిటీ సూచన మేరకు ఈసారి గ్లోబరీనా సంస్థతో పాటు మరో స్వతంత్ర సంస్థకు బాధ్యత అప్పగించాలని నిర్ణయించింది. దానిని ఎంపిక చేసే బాధ్యతను తెలంగాణ స్టేట్ టెక్నాలజీ సర్వీసెస్ కు అప్పగించింది. అది సిఫార్సు చేసిన సంస్థకు రీ-వెరిఫికేషన్ బాధ్యత అప్పగిస్తుంది. 

గ్లోబరీనా సంస్థ తప్పిదం కారణంగానే ఇంటర్ ఫలితాలలో ఇంత గందరగోళం ఏర్పడిందని ఇప్పటికే స్పష్టం అయ్యింది. దానిపై విద్యార్దులు, వారి తల్లితండ్రులు కూడా అనుమానాలు, ఆరోపణలు వ్యక్తంచేస్తున్నప్పటికీ, దానిని పక్కన పెట్టకుండా మళ్ళీ దానికే రీ-వెరిఫికేషన్ బాధ్యతను అప్పజెప్పడం విమర్శలకు తావిస్తోంది. గ్లోబరీనాపై ప్రతిపక్షాల విమర్శలను ఇంటర్ బోర్డు పట్టించుకోకపోయినా రేపు కోర్టులో సంజాయిషీ చెప్పక తప్పదని మరిచిపోకూడదు.


Related Post