రేవంత్‌ రెడ్డి ఒక రాజకీయ ఉగ్రవాది: బాల్క సుమన్

May 01, 2019


img

మాజీ ఐ‌టి మంత్రి కేటీఆర్‌ సిఫార్సు చేయడం వలననే గ్లోబరీనా సంస్థకు ఇంటర్మీడియెట్ బోర్డు కాంట్రాక్ట్ లభించిందంటూ కాంగ్రెస్‌ నేత రేవంత్‌ రెడ్డి చేసిన ఆరోపణలపై తెరాస ఎమ్మెల్యే బాల్కా సుమన్ తీవ్రంగా స్పందించారు. తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ, “రేవంత్‌ రెడ్డి ఒక రాజకీయ ఉగ్రవాది. నిత్యం ఏవో ఒక ఆరోపణలు చేస్తూ ప్రభుత్వంపై బురదజల్లడానికే ప్రయత్నిస్తుంటారు. ఇంటర్ బోర్డులో కొందరు అధికారుల మద్య ఏర్పడిన విభేధాల వలన,  కంప్యూటర్ సాఫ్ట్‌వేర్‌లో ఏర్పడిన కొన్ని లోపాల వలన ఇంటర్ పరీక్ష ఫలితాలలో సమస్య ఉత్పన్నం అయ్యింది. సిఎం కేసీఆర్‌ అధికారులతో మాట్లాడి ఆ సమస్యలను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ రేవంత్‌ రెడ్డి బోడి గుండుకు మోకాలుకు ముడి పెట్టాలని ప్రయత్నిస్తున్నట్లు ఈ అవకతవకలకు, గతంలో ఐ‌టి మంత్రిగా చేసిన కేటీఆర్‌కు ముడిపెట్టి బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. ఓటుకు నోటు కేసులో నోట్ల కట్టలతో అడ్డంగా దొరికిపోయిన ఒక దొంగ మా ప్రభుత్వంపై బురద జల్లాలని ప్రయత్నిస్తున్నారు. ఇంటర్ పరీక్ష ఫలితాలలో ఏర్పడిన గందరగోళాన్ని సరిదిద్దేందుకు మా ప్రభుత్వం కృషి చేస్తుంటే, ప్రతిపక్షాలు ఇంటర్ విద్యార్దులలో అపోహలు మరింత పెంచిపోషించేందుకు ప్రయత్నిస్తున్నాయి. నిజానికి గ్లోబరీనా, మాగ్నెటిక్ రెండు సంస్థలు కాంగ్రెస్‌ పెంచి పోషించినవే. ఇప్పుడు కాంగ్రెస్ నేతలే వాటిని వేలెత్తి చూపిస్తున్నారు,” అని విమర్శించారు. 

ఇంటర్ బోర్డులో అధికారుల మద్య విబేధాలు, గ్లోబరీనా అసమర్దత కారణంగానే ఇంటర్ ఫలితాలలో గందరగోళం ఏర్పడిందని ప్రతిపక్షాలు మొదటి నుంచి చెపుతున్నాయి. బాల్కా సుమన్ కూడా ఇప్పుడు అదే చెపుతున్నారు. బోర్డు నిర్లక్ష్యం కారణంగానే 23 మంది విద్యార్దుల ఆత్మహత్యలు చేసుకొన్నారు కనుక వారిపై చర్యలు తీసుకోవాలని ప్రతిపక్షాలు కోరుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టకు ఇంత భంగం కలిగించిన బోర్డు అధికారులపై, గ్లోబరీనా సంస్థపై ప్రభుత్వం ఇంతవరకు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడాన్నే ప్రతిపక్షాలు తప్పు పడుతున్నాయి. తప్పు జరిగినప్పుడు దానిని అంగీకరించి సరిదిద్దుకొంటే హుందాగా ఉంటుంది. కానీ ఆ తప్పును ఎత్తి చూపి ప్రశ్నిస్తున్నవారి నోళ్ళు మూయించాలని చూస్తే ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం తగ్గుతుంది. ప్రతిపక్షాలు కూడా ఈ సమస్యపై రాజకీయం చేయాలని ప్రయత్నించకుండా, బాధ్యులపై ప్రభుత్వం చర్యలు తీసుకొని, ఇటువంటి సమస్య భవిష్యత్ లో మళ్ళీ పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకొనేలా ఒత్తిడి చేస్తే సరిపోతుంది.   



Related Post