ఇంతకీ జగ్గారెడ్డి ఏమి చెప్పాలనుకొన్నారో?

May 01, 2019


img

అసెంబ్లీ ఎన్నికలలో తెరాస ప్రభంజనాన్ని తట్టుకొని గెలిచిన కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలలో సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి కూడా ఒకరు. నకిలీ పాస్ పోర్టుపై అమెరికాకు మనుషుల అక్రమరవాణా కేసులో సరిగ్గా ఎన్నికలకు ముందే జైలుకు వెళ్ళి వచ్చిన జగ్గారెడ్డి గెలుస్తారని ఎవరూ అనుకోలేదు కానీ గెలిచారు. ఆ కేసు ప్రభావమో లేక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ తెరాస చేతిలో ఘోరపరాజయం పాలైనందునో తెలీదు కానీ అప్పటి నుంచి జగ్గారెడ్డిలో చాలా మార్పు వచ్చింది. ఇకపై సిఎం కేసీఆర్‌పై ఎటువంటి విమర్శలు చేయనని, జిల్లా మంత్రులతో కలిసి పనిచేస్తూ తన నియోజకవర్గం అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు. 

ఆ తరువాత కొన్ని రోజులకు ఆయన తెరాసలో చేరబోతున్నారంటూ మీడియాలో ఊహాగానాలు మొదలయ్యాయి. వాటిని ఆయన గట్టిగా ఖండించకపోగా ‘నేను ఎప్పుడు ఏ పార్టీలో ఉండాలో కాలమే నిర్ణయిస్తుంది,’ అని చెప్పడం ద్వారా తెరాసలో చేరే అవకాశం ఉందని చెప్పకనే చెప్పారు.

మంగళవారం ఆయన సంగారెడ్డిలో మీడియా ప్రతినిధులతో మాట్లాడినప్పుడు, “నేను ఎప్పుడూ ఏ నిర్ణయం తీసుకొన్నా దాని వలన నా నియోజకవర్గంలోని ప్రజలకు మేలు కలగాలని ఆశిస్తాను. పదవులు, డబ్బు సంపాదించడం కోసం పార్టీలు మారవలసిన అవసరం నాకు లేదు. ప్రజాసంక్షేమం కోసం ఏది మంచిదనుకొంటే అది చేస్తుంటాను. నా రాజకీయ నిర్ణయాలన్నీ కేవలం ప్రజల కోసమే. అందుకే గతంలో కాంగ్రెస్‌ను వీడి తెరాసలో చేరాను. కానీ నియోజకవర్గం అభివృద్ధి కోసమే తెరాసను వీడి మళ్ళీ కాంగ్రెస్‌లోకి తిరిగి వచ్చాను. తెరాసలోకి రావాలని ఎవరూ నన్ను పిలువలేదు...వెళ్లాలని నేను ప్రయత్నించలేదు,” అని అన్నారు. 

డబ్బు, ప్రభుత్వ కాంట్రాక్టులు, పదవులు, అధికారం వాటి వలన లభించే పరపతి కోసం రాజకీయనాయకులు ఎప్పుడూ పరితపిస్తుంటారనే సనాగ్తి అందరికీ తెలుసు. ఒకవేళ రాజకీయాలలో ఈ ప్రయోజనాలు ఏవీ లభించనట్లయితే రాజకీయ నాయకులు ఎన్నికలలో గెలిచేందుకు పోటీలుపడి కోట్ల రూపాయలు ఖర్చు చేయరు కదా? కనుక జగ్గారెడ్డి చెపుతున్న ఈ నీతి కబుర్లను ప్రజలు నమ్ముతారనుకోలేము. అయినా జగ్గారెడ్డి పార్టీ మారాలనుకొంటే దానికి ఇంత సోది ఎందుకు? ఒకవేళ ఆయనకు నిజంగానే పదవి, అధికారాలపై వ్యామోహం లేదనుకొంటే తన పదవికి రాజీనామా చేసి పార్టీ మారవచ్చు కదా? అప్పుడు కాంగ్రెస్‌ పార్టీ కూడా అభ్యంతరం చెప్పదు కదా?


Related Post