టి-కాంగ్రెస్‌కు హైకోర్టులో ఎదురుదెబ్బ

April 30, 2019


img

తెలంగాణ కాంగ్రెస్‌కు హైకోర్టులో ఈరోజు ఎదురుదెబ్బ తగిలింది. కాంగ్రెస్‌ శాసనసభాపక్షాన్ని తెరాసలో విలీనం చేయడానికి తెర వెనుక ఏర్పాట్లు జరుగుతున్నాయని గ్రహించిన పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్‌ శాసనసభాపక్ష నేత మల్లు భట్టివిక్రమార్క ఈ విలీనాన్ని ఆపాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ వేశారు. వారి తరపు వాదించిన న్యాయవాది జంద్యాల రవిశంకర్‌ దీనిపై అత్యవసరంగా విచారణ జరపాల్సిందిగా హైకోర్టును అభ్యర్ధించగా, ప్రభుత్వం తరపున వాదించిన అడ్వకేట్ జనరల్ రామచంద్రరావు అభ్యంతరం తెలిపారు. ఇరుపక్షల వాదనలు విన్న తరువాత ఈ కేసుపై అత్యవసరంగా విచారణ జరపాల్సిన అవసరం లేదని హైకోర్టు అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఈ కేసును జూన్ 11వ తేదీకి వాయిదా వేసింది. అయితే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చట్ట ప్రకారం చర్యలు ఉంటాయని చెప్పింది. 

త్వరలోనే కాంగ్రెస్‌ శాసనసభాపక్షాన్ని తెరాసలో విలీనం చేయడానికి తెర వెనుక ప్రయత్నాలు జరుగుతున్నప్పుడు, ఈ కేసుపై అత్యవసరంగా విచారణ చేపట్టవలసిన అవసరం లేదని హైకోర్టు చెప్పడం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. కాంగ్రెస్‌ శాసనసభాపక్షం తెరాసలో విలీనం అయిపోయిన తరువాత జూన్ 11న ఈ కేసుపై హైకోర్టు విచారణ చేపట్టినా ఏమీ చేయలేదు. ఎందుకంటే, అప్పటికి ఈ వ్యవహారం స్పీకరు పరిధిలోకి వెళ్లిపోతుంది కనుక దీనిలో న్యాయస్థానం జోక్యం చేసుకోలేదు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యలుంటాయని న్యాయస్థానం చెప్పినప్పటికీ అది కూడా సాధ్యం కాదని గతంలోనే తేలిపోయింది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై హైకోర్టు చర్యలు తీసుకోగలిగితే ఎమ్మెల్యేలు ఎవరూ పార్టీ ఫిరాయించడానికి ఇంతగా సాహసించేవారుకారు. ఈవిషయంలో న్యాయస్థానాలు కూడా ఏమీ చేయలేవనే ధైర్యంతోనే ఎమ్మెల్యేలు పార్టీలు ఫిరాయిస్తున్నారని చెప్పక తప్పదు.


Related Post