తెలంగాణ బిజెపి దూకుడు అందుకేనా?

April 30, 2019


img

 లోక్‌సభ ఎన్నికల సందర్భంగా రాష్ట్ర బిజెపి నేతలు ‘తెలంగాణలో తెరాసకు ఏకైక ప్రత్యామ్నాయం బిజెపియేనని, లోక్‌సభ ఎన్నికల తరువాత కాంగ్రెస్ పార్టీ తుడిచిపెట్టుకుపోతుందని, ఆ తరువాత తెరాస భరతం పడతామని హెచ్చరించిన’ సంగతి అందరికీ గుర్తుండే ఉంటుంది. ఇంటర్ బోర్డు వ్యవహారంలో రాష్ట్ర బిజెపి నేతల దూకుడు చూస్తుంటే లోక్‌సభ ఎన్నికల ఫలితాలు రాకమునుపే వారు తమ కార్యాచరణ మొదలుపెట్టేసినట్లున్నారనిపిస్తోంది.

ఇంటర్ వ్యవహారంపై బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ సోమవారం నుంచి నిరవదిక నిరాహార దీక్షకు కూర్చోవడం,  మంగళవారం ఉదయం బిజెపి అధ్వర్యంలో ప్రగతి భవన్‌ ముట్టడించడం, మే 2వ తేదీన తెలంగాణ బంద్‌కు పిలుపునివ్వడం వంటివన్నీ కేవలం ఇంటర్ విద్యార్దులకు న్యాయం చేయడం కోసమే చేస్తున్న పోరాటాలనునుకొంటే రాజకీయ అజ్ఞానమే అవుతుంది. వరుసగా జరుగుతున్న ఈ పరిణామాలను నిశితంగా గమనిస్తే ఇంటర్ బోర్డు రూపంలో అందివచ్చిన అవకాశాన్ని రాష్ట్ర బిజెపి నేతలు తెలివిగా ఉపయోగించుకొంటూ పోరాటాల ద్వారా ప్రజలలోకి చొచ్చుకుపోవాలని ప్రయత్నిస్తునట్లు అర్ధమవుతోంది. ఈ ప్రయత్నాలలో బిజెపి నేతలు విజయం సాధిస్తారా లేదా అనే విషయాన్ని పక్కనపెడితే, లోక్‌సభ ఎన్నికల ఫలితాలను బట్టే రాష్ట్ర బిజెపి వైఖరి భవిష్య కార్యాచరణ ఉంటుందని ఖచ్చితంగా చెప్పవచ్చు. 

ఒకవేళ బిజెపి లేదా మిత్రపక్షాలతో కలిపి 300 ఎంపీ సీట్లు సంపాదించుకొని మళ్ళీ కేంద్రంలో సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేయగలిగినా లేదా కేంద్రంలో బిజెపి అధికారంలోకి రాలేకపోయినా ఇక తెరాస మద్దతు, దాని సహాయసహకారాలు బిజెపికి అవసరం ఉండవు కనుక రాష్ట్రంపై పట్టు పెంచుకొనేందుకు గట్టిగా ప్రయత్నించవచ్చు. అప్పుడు రాష్ట్రంలో మిగిలిన కాంగ్రెస్‌ నేతలను బిజెపిలోకి ఆకర్షించి తెరాసకు ప్రత్యామ్నాయంగా ఎదిగేందుకు గట్టిగా ప్రయత్నించవచ్చు. ఒకవేళ తెరాస దాని మిత్రపక్షాల మద్దతు తీసుకొని నరేంద్రమోడీ ప్రభుత్వం ఏర్పాటు చేయవలసి వస్తే రాష్ట్రంలో బిజెపి మళ్ళీ 5 ఏళ్ళపాటు ‘సైలెంట్ మోడ్’ లోకి వెళ్లిపోవచ్చు. 

కానీ లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడక మునుపే రాష్ట్రంలో బిజెపి చేస్తున్న ఈ హడావుడి చూస్తుంటే కేంద్రంలో బిజెపి పూర్తి మెజారిటీతో అధికారంలోకి రావడమో లేదా ఓడిపోవడమో జరుగవచ్చనిపిస్తుంది. ఆ రెండు పరిస్థితులలో బిజెపికి తెరాస మద్దతు అవసరం ఉండదు కనుకనే రాష్ట్ర బిజెపి నేతలు ఇంత హడావుడి చేస్తున్నారా?అనే సందేహం కలుగుతుంది. ఇది నిజమో కాదో తెలియాలంటే మే 23న ఫలితాలు వెలువడే వరకు అందరూ ఎదురు చూడాల్సిందే.


Related Post