డబ్బు కట్టలతో డిఆర్ఓను కలిసిన కాంగ్రెస్‌ అభ్యర్ది!

April 30, 2019


img

నాగర్ కర్నూల్‌ మండలంలోని గగ్గలపల్లి నుంచి కాంగ్రెస్‌ అభ్యర్ధిగా ఎంపీటీసీ ఎన్నికలకు నామినేషన్ వేసి ఉపసంహరించుకొన్న దొడ్ల వెంకటనారాయణ రెడ్డి సోమవారం ఉదయం రూ.10 లక్షలు డబ్బు కట్టలు చేత్తో పట్టుకొని జిల్లా రెవెన్యూ అధికారి కార్యాలయానికి వచ్చారు. తెరాస అభ్యర్ధిగా పోటీ చేస్తున్న దొడ్ల ఈశ్వర్ రెడ్డి ఆ సొమ్మును బలవంతంగా తన చేతిలో పెట్టి నామినేషన్ ఉపసంహరించుకోమని హెచ్చరించారని లేకుంటే తీవ్ర పర్యవసానాలు ఎదుర్కోవలసి ఉంటుందని హెచ్చరించడంతో భయపడి తాను నామినేషన్ ఉపసంహరించుకొన్నానని చెప్పారు. కానీ డబ్బుకు ఆశపడి, బెదిరింపులకు భయపడి ఆత్మవంచన చేసుకోవడం సరికాదనే భావనతో ఆ డబ్బును డిఆర్ఓకు అప్పగించడానికి వచ్చానని దొడ్ల వెంకటనారాయణ రెడ్డి చెప్పారు. డిఆర్ఓ ఆ డబ్బును తీసుకోవడానికి నిరాకరించి దానిని స్థానిక పోలీస్ స్టేషన్లో జమా చేయమని చెప్పడంతో నారాయణ రెడ్డి ఆవిధంగానే చేశారు. 

ఆయన పోలీసులకు ఆ నగదును అందజేస్తూ తనకు వ్యతిరేకంగా ఫిర్యాదు చేసినట్లు తెలుసుకొన్న తెరాస అభ్యర్ధి ఈశ్వర్ రెడ్డి ఆయనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలలో రాష్ట్రమంతటా తెరాస హవా కొనసాగినప్పుడు ఎంపీటీసీ ఎన్నికల కోసం ప్రత్యర్ధులను బెదిరించవలసిన, ప్రలోభపెట్టవలసిన అవసరం లేదని ఈశ్వర్ రెడ్డి అన్నారు. తనపై ఆరోపణలు రుజువు చేయాలని ఈశ్వర్ రెడ్డి సవాలు విసిరారు. 

ఎన్నికలలో ప్రత్యర్ధులను ఈవిధంగా ప్రలోభపెట్టి లేదా బెదిరించి పోటీ నుంచి తప్పించే ప్రయత్నాలు తరచూ జరుగుతూనే ఉంటాయి. ఏకగ్రీవ ఎన్నిక కోసం తెరాస అభ్యర్ధి అటువంటి ప్రయత్నమే చేసి ఉండొచ్చు. లేకుంటే కాంగ్రెస్‌ అభ్యర్ధి దొడ్ల వెంకటనారాయణ రెడ్డి నామినేషన్ ఉపసంహరించుకొని ఉండేవారు కాదు. ఉపసంహరించుకొన్న తరువాత తన సొంత సొమ్మును తీసుకువచ్చి డీఆర్ఓకు అప్పగించాలనుకోరు కదా? కనుక ఆ డబ్బును ఏ బ్యాంక్ నుంచి ఎవరు ఎప్పుడు డ్రా చేశారో పోలీసులు దర్యాప్తు చేయాలని దొడ్ల వెంకటనారాయణ రెడ్డి, అనుచరులు డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొన్నారు కానీ అధికారపార్టీకి చెందిన నేతపై విచారణ చేస్తారా? చూద్దాం.


Related Post