కర్ణాటక ఫార్ములాను కాంగ్రెస్‌అమలుచేయబోతోందా?

April 30, 2019


img

నేటికి సరిగ్గా 23 రోజులలో దేశరాజకీయాలలో పెనుమార్పులు జరుగనున్నాయి. ఈసారి లోక్‌సభ ఎన్నికలలో కనీసం 300 సీట్లు గెలుచుకొని సొంత బలంతోనే కేంద్రంలో మళ్ళీ అధికారంలోకి వస్తామని బిజెపి నేతలు నమ్మకంగా చెపుతున్నప్పటికీ, దేశంలో గుజరాత్ రాష్ట్రంతో సహా ఉత్తరాది రాష్ట్రాలలో కాంగ్రెస్‌ గట్టి పోటీనీయడం, కొన్ని ప్రాంతీయ పార్టీలు కాంగ్రెస్‌ నేతృత్వంలో పనిచేయడానికి సిద్దపడటం, మోడీ పట్ల దేశప్రజలలో కొంత వ్యతిరేకత పెరగడం వంటి అనేక కారణాల చేత బిజెపి-మిత్రపక్షాలు ప్రభుత్వం ఏర్పాటుకు సరిపడినన్ని ఎంపీ సీట్లు కూడా గెలుచుకోవడం కష్టంగానే కనిపిస్తోంది. 

అలాగని ఈసారి కాంగ్రెస్ పార్టీ కూడా గెలిచే అవకాశాలు కనిపించడం లేదు. గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి మరికొన్ని ఎంపీ సీట్లు అదనంగా గెలుచుకోగలదు కానీ స్వయంగా ప్రభుత్వం ఏర్పాటు చేయలేకపోవచ్చు. అందుకు బిజెపి గట్టి పోటీ నీయడం, మోడీకి రాహుల్ గాంధీ ఏవిషయంలోనూ సమఉజ్జీ కాకపోవడం, కాంగ్రెస్ పార్టీ పట్ల దేశప్రజలలో ఉన్న విముఖత వంటి కారణాలు కనిపిస్తున్నాయి. 

ఒకవేళ కాంగ్రెస్‌, బిజెపిలు రెండూ సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేయలేని స్థితిలో ఉన్నట్లయితే అప్పుడు ప్రాంతీయ పార్టీలు కీలకంగా మారుతాయి. ఫెడరల్‌ ఫ్రంట్‌ వేదికగా వాటిని కూడగట్టి కేంద్రప్రభుత్వం ఏర్పాటులో కీలకపాత్ర పోషిస్తానని కేసీఆర్‌ చెపుతున్నారు. కానీ ఆయన కేంద్రంలో మళ్ళీ నరేంద్రమోడీ ప్రభుత్వం ఏర్పడేందుకే ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటు చేస్తున్నారని కాంగ్రెస్‌ నేతలు ఆరోపిస్తున్నారు. ఫెడరల్‌ ఫ్రంట్‌లో ఎన్ని పార్టీలు చేరుతాయో? వాటికి ఎంత మంది ఎంపీలుంటారో ఇప్పుడే తెలియదు కనుక దాని బలం, వైఖరిని ఇప్పుడే అంచనా వేయలేము. 

ఒకవేళ కాంగ్రెస్‌ సొంతంగా కేంద్రప్రభుత్వం ఏర్పాటు చేయలేని స్థితిలో ఉంటే, అధికారం దక్కించుకోవడం కోసం కర్ణాటక ఫార్ములానే కాంగ్రెస్ పార్టీ అమలుచేయవచ్చు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయి అధికారం కోల్పోయే పరిస్థితి ఏర్పడినప్పుడు తన కంటే చాలా తక్కువ సీట్లు గెలుచుకొన్న జెడిఎస్ పార్టీకి మద్దతు ప్రకటించి, ముఖ్యమంత్రి పదవిని వదులుకొని అధికారం చేజారిపోకుండా కాపాడుకోగలిగింది. 

అదేవిధంగా లోక్‌సభ ఎన్నికలలో విజయం సాధించలేకపోతే మిత్రపక్షాలను చేరదీసి వాటిలో ఏదో ఒక పెద్ద పార్టీకి ప్రధానమంత్రి పదవిని అప్పగించడానికి సిద్దపడవచ్చు. కనుక ఈసారి కేంద్రంలో బిజెపి సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేయలేకపోతే ఇదే జరుగవచ్చు.


Related Post