హజీపూర్‌లో వరుస హత్యలు!

April 29, 2019


img

యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం హజీపూర్‌లో 10వ తరగతి విద్యార్దిని శ్రావణి హత్యకేసును పోలీసులు ఇంకా చేధించక మునుపే, అదే గ్రామంలో నెలరోజుల క్రితం అదృశ్యమైన మనీషా అనే మరో యువతి శవం కూడా శ్రావణి మృతదేహాన్ని పూడ్చిపెట్టిన బావిలోనే లభించడంతో గ్రామస్తులందరూ దిగ్బ్రాంతి చెందారు. 

సంచలనం సృష్టించిన శ్రావణి హత్యకేసుపై విచారిస్తున్న పోలీసులు కొందరు అనుమానితులను అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా వారిచ్చిన సమాచారంతో హాజీపూర్ శివారులో రోడ్డు పక్కన పొదలలో ఉన్న పాడుబడిన బావిలో మనీషా శవాన్ని పోలీసులు వెలికితీశారు. బావిలో ఆమె శవం పక్కనే ఆమె పుస్తకాల బ్యాగ్ కూడా లభించింది. దానిలో ఆమె ఆధార్ కార్డు ఉండటంతో ఆ శవం మనీషాదేనని పోలీసులు గుర్తించారు.

మనీషా మేడ్చల్ జిల్లాలోని కీసరలోని కెఎల్ఆర్ డిగ్రీ కాలేజీలో బీ.కాం. మొదటి సంవత్సం విద్యార్ధిని. సుమారు నెలరోజుల క్రితం కాలేజీకి వెళ్ళిన ఆమె మళ్ళీ తిరిగిరాలేదు. కానీ ఆమె తల్లితండ్రులు తిప్పరబోయిన మల్లేశం, భారతమ్మలు పోలీసులకు ఫిర్యాదు చేయకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఆమె తమపై కోపంతో ఇంట్లో నుంచి పారిపోయిందని భావించమని, ఏదో ఒక రోజున మళ్ళీ తమ కూతురు ఇంటికి తిరిగి వస్తుందనే నమ్మకంతోనే పోలీసులకు ఫిర్యాదు చేయలేదని చెప్పడం చూసి పోలీసులు కూడా విస్తుపోయారు. 

హైదరాబాద్‌ మహానగరానికి కేవలం 15కిమీ దూరంలో ఉన్న హజీపూర్‌కు సరైన బస్ సౌకర్యం లేకపోవడంతో గ్రామం నుంచి 3 కిమీ దూరంలో ఉన్న స్కూలు, కాలేజీలకు వెళ్ళే బాలబాలికలు చాలాసార్లు దట్టమైన చెట్లు, పొదలతో నిండి నిర్మానుష్యంగా ఉండే ఆ రోడ్డుపై ఒంటరిగా నడిచివెళ్ళక తప్పడం లేదు. ఇక సాయంత్రం చీకటిపడితే ఆ రోడ్డులో ప్రయాణించడానికి వాహనాలపై వెళ్ళే మగవారు సైతం భయపడుతుంటారు. అటువంటిది వయసులో ఉన్న ఆడపిల్లలు ఆ దారిగుండా ఒంటరిగా కనబడితే కీచకులు వదిలిపెడతారనుకోలేము. శ్రావణి, మనీషల విషయంలో అదే జరిగి ఉండవచ్చు. పోలీసుల దర్యాప్తు పూర్తయితే కానీ ఈ హత్యలకు ఎవరు కారకులో తెలియదు. 

హజీపూర్‌కు రోజూ బస్సు సౌకర్యం, నిర్మానుష్యంగా ఉండే ఆ 3 కిమీ రోడ్డులో పోలీస్ పెట్రోలింగ్, వీధి దీపాలు ఉండి ఉంటే ఆ ఇద్దరు ఆడపిల్లలు ప్రాణాలు నిలిచి ఉండేవని గ్రామస్తులు చెపుతున్నారు. గ్రామస్తులు కోరుతున్నవి పెద్ద కోర్కెలు కావని అర్దమవుతూనే ఉంది. కనీసం ఇప్పటికైనా అవి ఏర్పాటు చేస్తే మళ్ళీ ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా నివారించవచ్చు.


Related Post