వారణాసిలో నిజామాబాద్‌ రైతులకు చేదు అనుభవాలు

April 29, 2019


img

వారణాసి లోక్‌సభ నియోజకవర్గం నుంచి ప్రధాని నరేంద్రమోడీపై పోటీ చేయడానికి వెళ్ళిన 45 మంది నిజామాబాద్‌ పసుపు రైతులకు అక్కడ దిగిన మొదటి రోజు నుంచి చాలా చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. నామినేషన్లు వేయడానికి వచ్చిన వారిని రోజూ స్థానిక బిజెపి కార్యకర్తలు బెదిరిస్తున్నారని సమాచారం. కానీ ఎన్ని సవాళ్ళు ఎదురవుతున్నప్పటికీ 45మంది రైతులు నామినేషన్లు వేయడానికి వారణాసి కలెక్టర్ కార్యాలయం వద్దకు సకాలంలో చేరుకొన్నారు. కానీ వారిలో కేవలం 15 మంది రైతుల నుంచే అధికారులు నామినేషన్ పత్రాలు స్వీకరించినట్లు సమాచారం. మిగిలినవారివి ఎటువంటి కారణమూ చూపకుండానే తిరస్కరించినట్లు తెలుస్తోంది. 

నిజామాబాద్‌లో పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని, పసుపుకు మద్దతు ధర కల్పించాలనేవి వారి ప్రధాన డిమాండ్లు. వాటిని ప్రధాని నరేంద్రమోడీ, బిజెపిలతో సహా ఉత్తరాది ప్రజల దృష్టికి తీసుకువెళ్లాలనే ఏకైక ఉద్దేశ్యంతోనే వారు నామినేషన్లు వేస్తున్నారు తప్ప ప్రధాని నరేంద్రమోడీ అంతటివాడిని ఓడించగలమనే ఉద్దేశ్యంతో కాదు. కనుక పసుపు   రైతుల పోరాటదీక్షను మెచ్చుకోవలసిందే. కానీ వారిని చూసి స్థానిక బిజెపి నేతలు అసహనం ప్రదర్శిస్తుండటం, బెదిరిస్తుండటం నిజమైతే అది సిగ్గుచేటు. తమది రైతు సంక్షేమ ప్రభుత్వమని చెప్పుకొంటున్న బిజెపి, నామినేషన్లు వేయడానికి వచ్చిన రైతులను అడ్డుకోవలసిన అవసరం ఏమిటి? నిజామాబాద్‌లో తెరాస అభ్యర్ధి కవితకు వ్యతిరేకంగా వారిచేత నామినేషన్లు వేయించినప్పుడు లేని అభ్యంతరం ఇప్పుడు వారు నరేంద్రమోడీతో పోటీ పడాలనుకొంటే తప్పేమిటి? పోటీ పడితే బిజెపికి, నరేంద్రమోడీకి ఏమి నష్టం? ఏది ఏమైనప్పటికీ నిజామాబాద్‌ రైతులు అగమ్యంగా పోరాడుతున్నారని చెప్పకతప్పదు.


Related Post