ఏపీలో ఏమి జరుగుతోంది?

April 27, 2019


img

ఏపీలో ప్రస్తుతం చాలా విచిత్రమైన రాజకీయ వాతావరణం నెలకొని ఉంది. రాష్ట్రంలో ప్రజలెన్నుకొన్న ప్రభుత్వం... ముఖ్యమంత్రి అధికారంలోనే ఉన్నప్పటికీ ‘ఎన్నికల కోడ్’ పేరుతో రాష్ట్ర రాష్ట్ర ఎన్నికల సంఘం వారి చేతులు కట్టేసింది. ముఖ్యమంత్రి, మంత్రులు ఎవరూ కూడా అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహించకూడదని, పాలనాపరమైన ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదని ఆదేశిస్తోంది. 

ఇక ముఖ్యమంత్రి ఆదేశానుసారం పనిచేయవలసిన ప్రభుత్వ ప్రధానకార్యదర్శి (ఎల్వీ సుబ్రహ్మణ్యం) ముఖ్యమంత్రిని పక్కనబెట్టి పరిపాలన సాగిస్తున్నారు. అంతేకాదు...‘ఆయనొక అధికారాలు లేని ముఖ్యమంత్రి’ అని ఎద్దేవా చేసినట్లు మాట్లాడటం విశేషం. 

ప్రజలెన్నుకొన్న ప్రభుత్వం పనిచేయకూడదని చెప్పడాన్ని సిఎం చంద్రబాబునాయుడు, మంత్రులు తీవ్రంగా తప్పు పడుతున్నారు. పొరుగు రాష్ట్రమైన తెలంగాణలో కూడా ఎన్నికల కోడ్ అమలులో ఉన్నప్పటికీ అక్కడి ప్రభుత్వంపై ఎటువంటి ఆంక్షలు లేవని, సిఎం కేసీఆర్‌ రోజూ అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహించుకొంటున్నారని, తెలంగాణలో లేని ఆంక్షలు తమపైనే ఎందుకు విధిస్తున్నారని ఎన్నికల సంఘాన్ని ప్రశ్నిస్తున్నారు. ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు ఎవరూ రాజీనామాలు చేయనప్పుడు తమను ‘ఆపద్ధర్మ ప్రభుత్వం’ అని ఎలా అంటారని ప్రశ్నిస్తున్నారు.

పోలింగు పూర్తయి ఓటర్ల తీర్పు ఈవీఎంలలో నిక్షిప్తం అయిన తరువాత రాష్ట్రంలో ఇంకా ఎన్నికల కోడ్ అమలుచేయవలసిన అవసరం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రాన్ని పాలించడం కోసమే ఎన్నుకోబడిన తమకు ఆ అవకాశం లేకపోతే ఇక పేరుకు మంత్రులుగా ఉండి ఏమి ప్రయోజనమని ప్రశ్నిస్తున్నారు. అయితే అన్నిటికీ ‘ఎన్నికల కోడ్’ అనే ఒకే ఒక సమాధానం వినిపిస్తోంది తప్ప పరిస్థితులలో మార్పు కనిపించడం లేదు.

రాష్ట్రాన్ని, ప్రభుత్వాన్ని నడిపించవలసిన ప్రజలెన్నుకొన్న ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలకు-ప్రభుత్వానికి మద్య ఇటువంటి ఘర్షణ వాతావరణం ఏర్పడటం చాలా విస్మయం కలిగిస్తుంది. 

ప్రధాని నరేంద్రమోడీ కనుసన్నలలో పనిచేస్తున్న కేంద్రరాష్ట్ర ఎన్నికల సంఘాలు తమ ప్రభుత్వంపై ఈవిధంగా కక్షసాధింపు చర్యలకు పాల్పడటాన్ని ఖండిస్తూ చంద్రబాబునాయుడు కేంద్ర ఎన్నికల కమీషనుకు లేఖ వ్రాశారు. మే 23న ఫలితాలు వెలువడే వరకు తమను పరిపాలన చేసుకోనివ్వాలని చంద్రబాబు కోరారు. 

సిఎం చంద్రబాబు, మంత్రుల విమర్శలు, ఆరోపణలపై ఏపీ రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది స్పందిస్తూ, “ఇతర రాష్ట్రాలలో ఎన్నికల్ కోడ్ ఏవిధంగా అమలవుతోందో నాకు అనవసరం. ఏపీలో నిబందనల ప్రకారం అమలవుతోందా లేదా అనేదే నాకు ముఖ్యం. నేను నిబందనల ప్రకారమే నడుచుకొంటున్నాను తప్ప ఎన్నడూ నా పరిధిని అతిక్రమించడం లేదు,” అని స్పష్టం చేశారు. 

ఈ పరిణామాలపై ఏపీ రాష్ట్ర ప్రజలు కూడా తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. కేంద్రప్రభుత్వం, దాని కనుసన్నలలో పనిచేసే కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘాలు, వాటి కనుసన్నలలో పనిచేసే రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి అందరూ కలిసి ప్రజలెన్నుకొన్న రాష్ట్ర ప్రభుత్వంపై అత్యాచారం చేస్తున్నారని అభిప్రాయపడుతున్నారు. అసలు ఏపీలో ఇటువంటి విచిత్రమైన పరిస్థితి ఎందుకు ఏర్పడిందంటే దానికి 3 కారణాలు కనిపిస్తున్నాయి. 

1. ప్రధాని నరేంద్రమోడీతో చంద్రబాబునాయుడు శతృత్వం. 

2. ఆ కారణంగా బిజెపి తన రాజకీయప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ‘ఎన్నికల కోడ్’ అనే ఆయుధాన్ని ప్రయోగిస్తుండటం.  

3. పోలింగ్ తేదీకి కౌంటింగ్ తేదీకి మద్య ఏకంగా 40 రోజులకు పైగా వ్యవది ఉండటం. 

వీటిలో మొదటి కారణంగానే మిగిలిన రెండు సమస్యలు ఏర్పడ్డాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనప్పటికీ మే 23 వరకు చంద్రబాబు, మంత్రులు ఈ కోడ్ బాధను దిగమింగక తప్పదు. ఒకవేళ ఎన్నికలలో గెలిచి మళ్ళీ అధికారంలోకి వస్తే గట్టున పడతారు లేకుంటే మరింత తీవ్ర సమస్యలలో కూరుకుపోయే ప్రమాదం కనిపిస్తోంది.


Related Post