టీఆర్ఎస్‌ అంటే తిరుగులేని రాజకీయ శక్తి: కేటీఆర్‌

April 27, 2019


img

తెరాస 18వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ తెలంగాణ భవన్‌లో పార్టీ జెండా ఎగురవేసి, మంత్రులు, ప్రజా ప్రతినిధులు, పార్టీ నేతలు, కార్యకర్తలను ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “టీఆర్ఎస్‌ అంటే తిరుగులేని రాజకీయ శక్తి. ఆనాడు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్‌ తెరాసను స్థాపించినప్పుడు ఆయన వెంట ఉన్నది కొద్దిమందే. త్యాగాల పునాదుల మీదనే రాష్ట్రంలో ఏర్పడుతుందని భావించిన కేసీఆర్‌ తన పదవులకు రాజీనామాలు చేసి పోరాటం ప్రారంభించారు. 13 ఏళ్ళపాటు ఎత్తిన జెండా దించకుండా చేసిన సుదీర్గ పోరాటంలో యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలు కేసీఆర్‌ నాయకత్వంలో పోరాడి తెలంగాణ సాధించుకొని తమ కలను నెరవేర్చుకొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను,” అని అన్నారు. 

తెరాస ఆవిర్భవించినప్పుడు దానిలో కనిపించిన ఉద్యమస్పూర్తి ప్రజలను చైతన్యపరిచి ఉద్యమాలలో పాల్గొనేలా చేసిందని చెప్పక తప్పదు. తెలంగాణ సాధన కోసం రాష్ట్రంలో అన్ని పార్టీలు, అన్ని వర్గాల ప్రజలు, అనేక ఐకాసాలు పాల్గొన్నాయి. సుమారు 1500 మంది విద్యార్ధులు బలిదానాలు చేసుకొన్నారు. సిఎం కేసీఆర్‌ ఆమరణ నిరాహార దీక్షపై భిన్నాభిప్రాయాలున్నప్పటికీ దాని కారణంగానే ఉద్యమాలు పతాకస్థాయికి చేరుకొని కేంద్రప్రభుత్వంపై ఒత్తిడి పెంచాయని చెప్పక తప్పదు. నానాటికీ తీవ్రమవుతున్న తెలంగాణ ఉద్యమాలతో పెరిగిపోతున్న ఒత్తిడిని తట్టుకోలేక విధిలేని పరిస్థితిలోనే నాటి యూపీయే ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిందని చెప్పక తప్పదు. 

తెరాస 18వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆ పార్టీ తీరును నిశితంగా విశ్లేషించి చూసినట్లయితే తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించక మునుపు, తరువాత అని విభజించి చూడవలసి ఉంటుంది. తెలంగాణ ఏర్పడిన తరువాత తెరాస వైఖరిలో చాలా మార్పులు వచ్చాయని అందరికీ తెలుసు. తెలంగాణ రాక మునుపు తెలంగాణ సాధన అనే ఏకైక లక్ష్యంతో ముందుకుసాగి విజయం సాధించిన తెరాస, తెలంగాణ ఏర్పడిన తరువాత పక్కా రాజకీయ పార్టీగా మారిపోవడం చూసి ఉద్యమ సమయంలో దానితో కలిసి పనిచేసినవారు షాక్ అయ్యారని చెప్పక తప్పదు. 

రాష్ట్రంలో తెరాసకు ఎదురే ఉండకూడదనే ఏకైక లక్ష్యంతో ‘బంగారి తెలంగాణ సాధన’ పేరుతో ప్రతిపక్షపార్టీల నేతలను, ఎమ్మెల్యేలను, ఎంపీలను తెరాసలోకి ఫిరాయింపజేసుకొంటూ ముందుకు సాగుతూ కేటీఆర్‌ చెప్పినట్లుగా ‘టీఆర్ఎస్‌ అంటే తిరుగులేని రాజకీయ శక్తి’గా అవతరించిందని చెప్పక తప్పదు. కానీ అందుకోసం తెరాస ఎంచుకొన్న మార్గం, అనుసరిస్తున్న విధానాలపై భిన్నాభిప్రాయాలున్న సంగతి అందరికీ తెలుసు. తెరాస వ్యూహాలు, వైఖరి ఏవిధంగా ఉన్నప్పటికీ రాష్ట్రాభివృద్ధి చేస్తూ, సంక్షేమ పధకాలను అమలుచేస్తోంది కనుక ప్రజామోదం పొందగలుగుతోందని చెప్పవచ్చు.


Related Post