నిరుద్యోగభృతి ఇంకా ఎప్పుడో?

April 27, 2019


img

అసెంబ్లీ ఎన్నికలలో ఇచ్చిన హామీని నిలబెట్టుకొంటూ తెరాస సర్కారు వచ్చే నెలాఖరులోగా రైతుబంధు సొమ్మును విడుదల చేయబోతోంది. కానీ రైతు రుణమాఫీ హామీని ఇంకా ఎప్పటి నుంచి అమలుచేస్తుందో తెలియదు. రాష్ట్రంలో 10 లక్షలకు పైగా ఉన్న నిరుద్యోగులకు నెలకు రూ.3,000 చొప్పున నిరుద్యోగభృతి ఇస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇవ్వగానే దానికి మరో రూ.16 కలిపి నెలకు రూ.3,016 చొప్పున నిరుద్యోగభృతి చెల్లిస్తామని తెరాస హామీ ఇచ్చింది. కానీ ఇంతవరకు నిరుద్యోగభృతిపై కూడా ఎటువంటి నిర్ణయమూ తీసుకోలేదు. 

కేసీఆర్‌ మళ్ళీ ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టగానే మీడియాతో మాట్లాడుతూ “నిరుద్యోగ భృతి పధకాన్ని అమలు చేసేందుకు ముందుగా రాష్ట్రంలో ఎంతమంది నిరుద్యోగులు ఉన్నారో తెలుసుకోవలసి ఉంది. నిరుద్యోగభృతి చెల్లింపుకు మార్గదర్శకాలు రూపొందించవలసి ఉంది. దీనికంతటికీ రెండు మూడు నెలల సమయం పట్టవచ్చు,” అని అన్నారు. 

ఆ తరువాత ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన మద్యంతర (తాత్కాలిక) బడ్జెట్‌లో నిరుద్యోగభృతి చెల్లింపుల కోసం రూ. ప్రభుత్వం 1,810 కోట్లు కేటాయించడంతో నిరుద్యోగులలో మళ్ళీ ఆశలు చిగురించాయి. త్వరలోనే నిరుద్యోగభృతి చేతికి అందుతుందని చాలా ఆశపడ్డారు. కానీ ఇంతవరకు ఆ పధకం ప్రారంభించలేదు. ఎన్నికల సమయంలో నిరుద్యోగభృతి చెల్లిస్తామని మైకులు పగిలిపోయేలా పదేపదే చెప్పిన తెరాస నేతలు అధికారంలోకి వచ్చి 4 నెలలు గడుస్తున్నా దాని గురించి మాట్లాడకుండా మౌనం వహిస్తుండటంతో నిరుద్యోగులకు ఆవేదన, ఆగ్రహం కలుగుతోంది. కానీ వరుస ఎన్నికలతో బిజీగా ఉన్న ప్రభుత్వానికి నిరుద్యోగభృతి గురించి ఆలోచించే తీరిక లేకుండా పోయింది. పరిషత్, మున్సిపల్ ఎన్నికలు కూడా ముగిస్తేగానీ నిరుద్యోగభృతి హామీ అమలు గురించి ఆలోచించలేకపోవచ్చు. కనుక నిరుద్యోగులు అప్పటివరకూ ఓపికగా ఎదురుచూడక తప్పదు.


Related Post