రసగుల్లా పంపిస్తా ఓట్లు కాదు!

April 26, 2019


img

రసగుల్లా పేరు తలుచుకోగానే నోట్లో నీళ్లూరకమానవు. అదీ..బెంగాల్ రసగుల్లా అంటే మరి చెప్పక్కరలేదు. కానీ అంత తీయనైన రసగుల్లా చేదుగా అనిపిస్తోందిప్పుడు. ఇటీవల ప్రముఖ బాలీవుడ్ నటుడు అక్షయ్ ప్రధాని నరేంద్రమోడీని ఇంటర్వ్యూ చేశారు. 

ఆ సందర్భంగా ప్రధాని మోడీ ఒక ప్రశ్నకు సమాధానంగా, “నాకు ఇతర పార్టీలలో కూడా మంచి స్నేహితున్నారు. పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా వారిలో ఒకరు. నాకు రసగుల్లాలు చాలా ఇష్టమని తెలిసి ఆమె అప్పుడప్పుడు నాకు కుర్తలు, రసగుల్లాలు, మిఠాయిలు పంపిస్తుంటారు కూడా,” అని చెప్పారు. 

ఈసారి లోక్‌సభ ఎన్నికలలో బిజెపికి సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవసరమైనన్ని ఎంపీ సీట్లు గెలుచుకోలేకపోవచ్చుయనని మీడియాలో ఊహాగానాలు వినిపిస్తున్న కారణంగా, ప్రధాని నరేంద్రమోడీ ఆమెను ప్రసన్నం చేసుకొని తృణమూల్ కాంగ్రెస్ ఎంపీల మద్దతు పొందడానికే ఆవిధంగా అని ఉండవచ్చునని ఊహాగానాలు వినిపించాయి. 

వాటిపై మమతా బెనర్జీ ఘాటుగా స్పందించారు. బెంగాలీలకు అతిముఖ్యమైన దసరా పండుగ సందర్భంగా ఆనవాయితీ ప్రకారం ప్రతీ ఏడు నేను చాలా మందికి బట్టలు, స్వీట్లు పంపిస్తుంటాను. నరేంద్రమోడీకి కూడా ఆవిధంగానే పంపించాను. కానీ మా రాష్ట్రంలో ఒక్క ఓటు కూడా బిజెపికి పడకుండా చేస్తాను,” అని అన్నారు. 

ప్రధానమంత్రి రేసులో ఉన్న విపక్ష నేతలలో మమతా బెనర్జీ కూడా ఒకరు. కానీ ఆమె కాంగ్రెస్ పార్టీవైపు ఉంటారా లేక కేసీఆర్‌ ఏర్పాటు చేస్తున్న ఫెడరల్‌ ఫ్రంట్‌లో ఉంటారా అనే విషయం చెప్పడం లేదు. లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వస్తేగానీ ఈ సస్పెన్స్ వీడదు.


Related Post