తెరాస తిట్టేది కాంగ్రెస్‌నే..చేర్చుకొనేది కాంగ్రెస్‌ నేతలనే!

April 26, 2019


img

నల్గొండ జిల్లాలో నార్కాట్ పల్లిలో గురువారం జరిగిన పరిషత్ ఎన్నికల సన్నాహక సభలో మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ, “కాంగ్రెస్‌ నేతలది ఫ్యూడల్ మనస్తత్వం...వారు అభివృద్ధి నిరోదకులు, వారి కారణంగానే తెలంగాణ అభివృద్ధికి నోచుకోలేదు...ఉమ్మడి నల్గొండ జిల్లాకు కాంగ్రెస్‌ శాపంగా మారింది,” అంటూ తీవ్ర విమర్శలు చేశారు. “సిఎం కేసీఆర్‌ చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను చూసే నకిరేకల్ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య తెరాసలో చేరారు,” అంటూ తన ప్రసంగం ముగించారు.   

కాంగ్రెస్‌ నేతలపై ఇన్ని విమర్శలు చేసిన జగదీష్ రెడ్డి, మళ్ళీ అదే కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య తెరాసలో చేరడాన్ని స్వాగతించడం చాలా విచిత్రంగా ఉంది. ఒకవైపు కాంగ్రెస్‌ నేతలు అవినీతిపరులు, అసమర్దులు కాంగ్రెస్ పార్టీ నుంచి రాష్ట్రానికి, దేశానికి విముక్తి కల్పించాలని వాదిస్తూనే తెరాసను కాంగ్రెస్ నేతలతో ఎందుకు నింపుకొంటున్నట్లు? కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు నేతలను, ఎమ్మెల్యేలను రాష్ట్రాభివృద్ధిని వ్యతిరేకించేవారని నిందించే తెరాస నేతలు, వారు రాష్ట్రాభివృద్ధి కోసమే తెరాసలో చేరుతున్నారని చెప్పుకోవడం చాలా హాస్యాస్పదంగా ఉంది.      రాష్ట్రంలో అవినీతి కాంగ్రెస్‌ ఉండకూడదని చెపుతూ దానిని తెరాసలోనే కలుపుకోవడం ఇంకా విచిత్రంగా ఉంది.   

అవినీతిపరులు, అసమర్దులు, ఫ్యూడల్ మనస్తత్వం కలిగి అభివృద్ధి నిరోధకులుగా ఉన్న కాంగ్రెస్‌ నేతలు తెరాసలో చేరగానే హటాత్తుగా మారిపోతారా? లేక అటువంటివారినందరినీ చేర్చుకొని తెరాసనే మరో కాంగ్రెస్ పార్టీలాగా మారిపోతోందా? అనే ప్రశ్నలకు తెరాసయే సమాధానం చెప్పాలి.       

రాష్ట్రంలో తెరాసకు ఎదురు ఉండకూడదనే ఉద్దేశ్యంతో తెరాస ఫిరాయింపులను ప్రోత్సహిస్తోందని, దానికి రాష్ట్రాభివృద్ధి అనే అందమైన ముసుగువేస్తోందని సంగతి అందరికీ తెలుసు. కానీ రాష్ట్రంలో తెరాసకు ఎదురేలేకుండా చేసుకొనే ప్రయత్నంలో పార్టీని ఫ్యూడల్ మనస్తత్వం ఉన్నవారితో నింపుకొంటే ఏమవుతుంది? 


Related Post