వారణాసిలో మోడీని డ్డీకొనేది ఎవరంటే...

April 25, 2019


img

గత నెలరోజులుగా కాంగ్రెస్‌ పార్టీ ఒక ఆసక్తికరమైన చర్చను నడిపించి చివరికి తుస్సుమనిపించేసింది. అదేమిటంటే, ఏఐసిసి కార్యదర్శిగా ప్రత్యక్ష రాజకీయాలలోకి ప్రవేశించిన ప్రియాంకా వాద్రా ఈసారి లోక్‌సభ ఎన్నికలలో వారణాసి నుంచి ప్రధాని నరేంద్రమోడీపై పోటీ చేస్తారని! 

‘వారణాసి నుంచి మోడీపై పోటీకి నేను రెడీ!’ అని ప్రియాంకా వాద్రా అంటే ‘ఈ సస్పెన్స్ ఇప్పుడే బయటపెట్టను,’ అని రాహుల్ గాంధీ చెప్పడంతో ఆమె వారణాసి నుంచి పోటీ చేయవచ్చుననే ఊహాగానాలకు బలం చేకూరింది. 

ఒకవేళ ఆమె నిజంగా వారణాసి నుంచి నరేంద్రమోడీపై పోటీ చేసి గెలిస్తే కాంగ్రెస్ పార్టీలో రాహుల్ గాంధీ కంటే ఆమెకు మంచి పేరు లభిస్తుంది. కానీ నరేంద్రమోడీని ఓడించడం దాదాపు అసాధ్యం కనుక జీవితంలో మొదటిసారిగా ఎన్నికలలో పోటీచేసినప్పుడే మోడీ చేతిలో ఓడిపోతే ఆమె రాజకీయజీవితానికి ఆరంభంలోనే పెద్ద ఎదురుదెబ్బ తగులుతుంది. కనుక రాహుల్ గాంధీ ఆమెకు ఆ కష్టం లేకుండా వారణాసి నుంచి గత ఎన్నికలలో నరేంద్రమోడీపై పోటీ చేసి ఓడిపోయిన సీనియర్ కాంగ్రెస్‌ నేత అజయ్ రాయ్ పేరును ఈరోజు ప్రకటించారు. దీంతో వారణాసి సస్పెన్స్ కధ ముగిసిపోయింది.  

అయితే కాంగ్రెస్ పార్టీకి...ముఖ్యంగా రాహుల్ గాంధీ భవిష్యత్తుకు ఈ ఎన్నికలు జీవన్మరణ సమస్యవంటివి కనుక ప్రతీ ఒక్క ఎంపీ సీటు కూడా కాంగ్రెస్ పార్టీకి చాలా కీలకమైనదే. అందుకే రాజకీయాల నుంచి తప్పుకోవాలనుకొన్న సోనియాగాంధీ చేత మళ్ళీ రాయ్ బరేలీ నుంచి పోటీ చేయిస్తున్నారని చెప్పవచ్చు. ప్రియాంకా వాద్రా యూపీలో పోటీ చేస్తే అవలీలగా గెలిచే అవకాశం ఉంటుంది కనుక ఆ ఒక్క సీటు కూడా గెలుచుకోవడం కోసం ఆమెను కూడా కాంగ్రెస్ పార్టీ తప్పకుండా ఎన్నికల బరిలో దించవచ్చు. 

ఆమెకు యూపీలో మంచి ప్రజాధరణ ఉంది. పైగా ప్రస్తుతం ఆమె తూర్పు యూపీ జిల్లాలలో కాంగ్రెస్‌ పార్టీని గెలిపించుకొనే బాధ్యత స్వీకరించారు. కనుక ఆమె అక్కడే ఏదో ఒక నియోజకవర్గం నుంచి పోటీ చేయవచ్చు.


Related Post