అందుకే ఫెడరల్‌ ఫ్రంట్‌ను బిజెపి పట్టించుకోవడం లేదా?

April 25, 2019


img

ప్రధాని నరేంద్రమోడీ, అమిత్ షా మొదలు రాష్ట్ర స్థాయి నేతలవరకు బిజెపిలో అందరూ కాంగ్రెస్‌ నేతృత్వంలో ఏర్పాటవుతున్న కూటమిని లక్ష్యంగా చేసుకొని తీవ్ర విమర్శలు చేస్తుండటం చూస్తూనే ఉన్నాము. ఒకవేళ కాంగ్రెస్‌ నేతృత్వంలో కూటమి కేంద్రంలో అధికారంలోకి వస్తే రోజుకో కొత్త ప్రధాని పాలిస్తారని అమిత్ షా ఎద్దేవా చేశారు. 

కాంగ్రెస్‌ కూటమిని ఇంతగా విమర్శిస్తున్న బిజెపి నేతలెవ్వరూ కూడా కేసీఆర్‌ ఏర్పాటు చేయబోతున్న ఫెడరల్‌ ఫ్రంట్‌పై ఒక్క విమర్శ చేయకపోవడం గమనార్హం. ప్రధాని నరేంద్రమోడీ, బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షాలైతే అసలు ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటవుతున్నట్లు తమకు తెలియదన్నట్లు వ్యవహరిస్తున్నారు. రాష్ట్ర బిజెపి నేతలు కేసీఆర్‌ చేస్తున్న ఫెడరల్‌ ఫ్రంట్‌ ప్రతిపాదనపై విమర్శలు గుప్పిస్తున్నప్పటికీ అవి ఎన్నికల కోసమేనన్నట్లున్నాయి. రాష్ట్రంలో ఎన్నికలు ముగిసాయి కనుక వారి విమర్శలు కూడా ఆగిపోయాయి.  

సిఎం కేసీఆర్‌ ఫెడరల్‌ ఫ్రంట్‌ పేరుతో కాంగ్రెస్ మిత్రపక్షాలను చీల్చి కాంగ్రెస్‌ పార్టీని దెబ్బతీసి, మళ్ళీ నరేంద్రమోడీ అధికారపీఠంపై కూర్చోబెట్టేందుకే ప్రయత్నిస్తున్నారని కాంగ్రెస్‌ నేతలు ఆరోపిస్తున్నారు. బహుశః అందుకే బిజెపి నేతలు ఎవరూ ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటును వ్యతిరేకించడంలేదేమో? కానీ దేశరాజకీయలలో గుణాత్మకమైన మార్పు కోసమే తాను ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటు చేస్తున్నానని సిఎం కేసిఆర్ చెప్పుకొంటున్నారు. ప్రాంతీయ పార్టీలతో కలిసి ఏర్పాటుచేయబోతున్న ఫెడరల్‌ ఫ్రంట్‌ కాంగ్రెస్‌, బిజెపిలకు ప్రత్యామ్నాయంగా బలమైన రాజకీయ శక్తిగా ఆవిర్భవించబోతోందని, ఫలితాలు వెలువడిన తరువాత ఫెడరల్‌ ఫ్రంట్‌ కేంద్రంలో కీలకపాత్ర పోషిస్తుందని కేసీఆర్‌ చెపుతున్నారు. 

కనుక సిఎం కేసీఆర్‌ నిజంగానే కాంగ్రెస్‌, బిజెపిలకు వ్యతిరేకంగా ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటు చేస్తున్నారా లేక నరేంద్రమోడీకి మద్దతు కూడగట్టడానికే ఏర్పాటు చేస్తున్నారా?అంటే ఫెడరల్‌ ఫ్రంట్‌ పట్ల బిజెపి ఉదాసీన వైఖరిని గమనిస్తే అది బిజెపికి తోడ్పడేందుకే ఏర్పాటవుతున్నట్లు అనిపిస్తుంది. ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటు వెనుక కేసీఆర్‌ అసలు ఉద్దేశ్యం ఏమిటనే ప్రశ్నకు మే 23న లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత సమాధానం దొరకుతుంది. 


Related Post